పైకి పొత్తు లేకున్నా లోలోన మాత్రం కేంద్రానికి ఏపీలోని వైసీపీ అండగా నిలుస్తోంది. ఇదిలావుంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి మరోమారు అండగా నిలవాలని నిర్ణయించింది. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని బయటపడేయడంతోపాటు ఢిల్లీలో సేవల నియంత్రణకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ రెండు గండాల నుంచి ప్రభుత్వం ఈజీగా బయటపడేలా కనిపిస్తోంది.
వైసీపీకి రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లుల సమయంలో వీరంతా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సేవల నియంత్రణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినా రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ద్వారా దానిని బయటపడేయాలని చూస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ఈ విషయంలో మరింత స్పష్టతనిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.