ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడం.. దాదాపు నాలుగు గంటలపాటు అక్కడే ఉండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.
మరోవైపు తిరుపతిఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. వచ్చే నెల 12న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియనుంది. కొత్తగా ఛైర్మన్, పాలకమండలి సభ్యులను ఈ వారంలో ఖరారు చేసే అవకాశం ఉ:ది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన భూమన.. టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న సమయంలో భూమన సీఎంను కలవడం ప్రాధాన్యత ఏర్పడింది. భూమాన మాత్రం తాను నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి మాట్లాడేందుకే సీఎంను కలిసినట్లు చెప్పారు.
జగన్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని స్థానంలో ఎంపీ విజయసాయిరెడ్డిని ఇటీవల నియమించారు. ఈ క్రమంలో జగన్‌తో బాలినేని భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. తాను ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండబోనని.. ఆ బాధ్యతల్ని వేరే ఎవరికైనా వేరెవరికైనా అప్పగించాలని ఇప్పటికే బాలినేని తేల్చి చెప్పారు. అయితే జగన్, బాలినేనిల భేటీలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది చూడాలి. తన నియోజకవర్గంలో ఇంకా కొలిక్కి రాని ఇళ్ల స్థలాల పట్టాల సమస్య పరిష్కరించాలని కోరేందుకు సీఎం జగన్‌ను కలిసినట్లు చెబుతున్నారు. తమ భేటీలో రాజకీయాంశాలూ .. ఫిర్యాదులూ ఏవీ లేవన్నారు.