టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. రోజుకో నియోజకవర్గంపై సమీక్ష చేస్తూ అవసరమైన చోట మార్పులు, చేర్పులు చేస్తున్నారు. తాజాగా మరో నియోజకవర్గానికి సంబంధించి ఇంఛార్జ్‌ను మార్చేశారు. పార్వతీపురం జిల్లాలో పార్టీ మరింత బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నర్సిపురంకు చెందిన బోనెల విజయచంద్రను నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇంఛార్జ్‌గా ఉన్నారు. చిరంజీవులు 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి విజయం సాధించారు. 2019లో జోగారావు చేతిలో ఓడిపోయారు. చిరంజీవుల్ని తప్పించి విజయచంద్రకు నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు.
కొత్త ఇంఛార్జ విజయ చంద్ర తండ్రి ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేశారు. బీటెక్ పూర్తిచేసిన విజయచంద్ర కార్పొరేట్ సెక్టార్‌లో కొన్నేళ్లు పనిచేసి.. తర్వాత వ్యాపారం వైపు మళ్లారు. చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే అభిమానమని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ నెల 6న పార్వతీపురం నియోజకవర్గ నాయకులతో పార్టీ పరిస్థితిపై చంద్రబాబునాయుడు మంగళగిరిలో మాట్లాడారు. ఈ సమయంలో కొందరు నాయకులు చిరంజీవులు నాయకత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో 26న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులతో మరోసారి చంద్రబాబు చర్చించారు. గురువారం ఆయన స్థానంలో విజయచంద్రను ఇన్‌ఛార్జిగా నియమించారు.
మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంపైనా సమీక్ష చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని.. టీడీపీకి కంచుకోటగా వున్న భీమిలిలో గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే ఓటమి పాలయ్యామన్నారు. దీనికి కారణాలను చంద్రబాబు వివరించారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని.. అలాగని అలసత్వం వహించవద్దన్నారు. తొలుత పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా, షరీఫ్‌లు ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా మాట్లాడి, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికలు ముగిసేంత వరకూ కష్టపడి పనిచేయాలని, భవిష్యత్తు మనదేనని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. అధికార బలంతో ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలుపొందేందుకు వైఎస్సార్‌సీపీ పెద్దఎత్తున నకిలీ ఓట్లను సృష్టిస్తోందన్నారు. దీనిపై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ముందుకుసాగాలని.. పార్టీ తొలి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని.. స్థానిక సమస్యలపై పోరాటం చేయాలన్నారు. అన్నివిధాలుగా ఆలోచించే గెలిచే వారికే టిక్కెట్ ఇస్తానని, పార్టీ అభ్యర్థి విజయమే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ దుష్ట పాలన నుంచి ప్రజలను విముక్తులను చేయడమే అందరి కర్తవ్యం కావాలన్నారు.