ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక సూచనలు చేశారు. చంద్రబాబు మాయల ఫకీరు వంటివాడని, ఆయన మాయలో పడి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా నష్టపోయారని అన్నారు. పురందేశ్వరి గారూ... ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడుస్తామంటే మీ ఇష్టం అని వ్యాఖ్యానించారు. 'పురందేశ్వరి తండ్రి స్థాపించిన పార్టీని ఇప్పుడు మరిది నడుపుతున్నారు... వీళ్లేమో వేరే పార్టీని నడుపుతున్నారు' అంటూ గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మరిది స్క్రిప్టునే పురందేశ్వరి మాట్లాడుతున్నారని, ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీరా? చంద్రబాబా? అనేది చెప్పాలన్నారు. లేకపోతే, పురందేశ్వరి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని మాట్లాడితే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.