ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘బ్రో’ సినిమా డిజాస్టర్,,, కలెక్షన్లు భారీగా పడిపోయాయన్న మంత్రి అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 06:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ శ్యాంబాబు పాత్ర ద్వారా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటల వద్ద లంబాడి మహిళలతో కలిసి అంబటి రాంబాబు డాన్స్ చేశారు. ఆ డాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ, కించపరుస్తూ శ్యాంబాబు పాత్ర ద్వారా కామెడీని పండించారనేది ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారం.


ఇదే విషయాన్ని శ్యాంబాబు పాత్ర పోషించిన కమెడియన్ పృథ్వీని అడిగితే.. ‘ఆ రాంబాబు ఎవరో నాకు తెలీదు. అయినా ఆయనేమైనా ఆస్కార్ నటుడా నేను ఇమిటేట్ చేయడానికి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి రాంబాబుకు బాగా కాలినట్టుంది. తనను కించపరుస్తూ ఒక పాత్రను క్రియేట్ చేయడమే కాకుండా.. తనపై ఒక నటుడు ఈ విధంగా మాట్లాడడాన్ని రాంబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘బ్రో’ సినిమా పరిస్థితి ఏంటో చెప్పారు.


‘సాధారణంగా సినిమాల గురించి నేను ఎప్పుడూ పెద్దగా మాట్లాడను. ఇవాళ మాట్లాడవల్సిన అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసినవాళ్లు కల్పించారు. దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి.. ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ పాత్ర దూషించి, కించపరచాలనేటు వంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను.. దాని గురించి వివరంగా కూడా చెప్పాను. అంతటితో ఆగలేదు. దానిలో నటించిన నటులు మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు. బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి.. దాన్ని కాంట్రవర్సీ చేయడం ద్వారా కొంచెం కలెక్షన్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది.


పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర అద్భుతంగా రాణిస్తోందని.. సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో పాటు సక్సెస్ మీట్‌లు కూడా పెట్టుకుంటున్నారు. చివరికి దీని నిజస్వరూపం ఏంటయ్యా అంటే.. ఇది అట్టర్ ఫ్లాప్ మూవీ, డిజాస్టర్. ఇది ఆధారాలు లేకుండా నేను చెప్పడం లేదు. నిన్నటి వరకు ఈ సినిమా రూ.55.20 కోట్ల షేర్ వసూలు చేసింది. నిన్న అయితే కలెక్షన్ చాలా దారుణంగా పడిపోయింది. రూ.2.3 కోట్ల మేర షేర్ వచ్చింది. మొత్తంగా రూ.70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మళ్లీ కాంట్రవర్సీ చేసి.. శ్యాంబాబు రాంబాబు అని మాట్లాడితే ఒక కోటి రూపాయలు పెరగొచ్చు.


టోటల్‌గా ఈ పిక్చర్ అట్టర్ ఫ్లాప్. అలా ఎందుకైంది. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే.. దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి, దూషించి ఆనందం పొందాలి, పైశాచికానందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. కమర్షియల్‌గా హిట్టు కాదు. ప్రజలకు చేరదు. త్రివిక్రమ్ మంచి మాటల రచయిత. ఆయన, పవన్ కళ్యాణ్ కూర్చొని సన్నివేశాన్ని క్రియేట్ చేసి.. దానికి మాటలు రాసి.. దానికి ఇమిడ్చి.. చాలా ఆనందం పొందాలనే ప్రయత్నం చేశారు. సుమారుగా ఒక రోజు దీని షూటింగ్‌కు కేటాయించి ఉంటారు.


ఈ సినిమాకు మొత్తం రూ.60 కోట్లో, రూ.70 కోట్లో వస్తే.. ఈ చిత్ర సినిమాకు హీరోగా చేసిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ నాకున్న సమాచారం మేరకు రూ.50 కోట్ల పైన. అంటే, మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల తీసేశారు. దీనికి కారణం దృష్టి సరిగా లేకపోవడం. శత్రువులను దీనిలో ఇమిడ్చి శునకానందం పొందాలనే తాపత్రయం.


ఇక రెండో కారణం దగ్గరకి వస్తే.. ఇంతకు ముందు కూడా చెప్పాను.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక ఆడవు. వారాహి అనే పవిత్రమైన దేవతని తన కాళ్లకింద పెట్టుకుని వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో.. ఆ వాహనం మీదికి ఎక్కి అవాకులు, చవాకులు, అబద్దాలు అడే ప్రయత్నం చేశాడో.. ఆరోజే వారాహి అనే అమ్మవారి శాపం అతనికి తగిలింది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు. రాజకీయంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఆయన సినిమాలు ఆడవు అని నేను చెప్పాను. ఈరోజు అదే జరుగుతుందని నిర్మాతలు, ఇండస్ట్రీ వాళ్లు తెలుసుకుంటే మంచిది’ అని మంత్రి రాంబాబు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com