భూమా నాగిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. నాగిరెడ్డి, శోభ మరణాల తర్వాత అఖిలప్రియ భూమా కుటుంబంలో రాజకీయ వారసురాలిగా ఉన్నారు. ఆళ్లగడ్డ నుంచి అఖిల, నంద్యాల నుంచి ఆమె సోదరుడు బ్రహ్మానందరెడ్డిలు టీడీపీ బాధ్యతల్ని చూస్తున్నారు. ఇంత వరకు స్టోరీ బాగానే ఉంది.. ఇప్పుడు భూమా ఫ్యామిలీలో టికెట్ పంచాయితీ మొదలైంది. నంద్యాల సీటుపై పొలిటికల్ హీట్ నడుస్తోంది.
నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ రేసులో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు భూమా అఖిల ప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా నంద్యాలపై ఫోకస్ పెట్టారు. కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడితో ఆగకుండా విఖ్యాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. ఈ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
తన సోదరి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు చెప్పారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుంచే తాను రాజకీయాల్లోకి అడుగు పెడతానంటున్నారు. కానీ తనను నంద్యాలలో తిరగొద్దని పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోందని.. అదంతా అవాస్తవం అన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తానన్నారు. తాను నంద్యాల నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతానని సంకేతాలు పంపారు
తన తండ్రి బాటలో నంద్యాల నుంచే రాజకీయం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నారు. తాను ఏమాట మాట్లాడినా ఆలోచించే మాట్లాడతానని.. తాను మాట్లాడితే ఒక అర్థం ఉంటుందన్నారు. ఎవరికి సత్తా ఉంటుందో.. ఎవరు కార్యకర్తలకు భరోసా ఇస్తారో వారికే టికెట్ వస్తుందనే నమ్మకం ఉందని గతంలోనే వ్యాఖ్యానించారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానన్నారు. జగత్ విఖ్యాత్ నంద్యాలకు ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
నంద్యాల సీటు కోసం టీడీపీలోనే ముగ్గురు పోటీపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు భూమా జగత్ విఖ్యాత్ ఎంట్రీతో భూమా ఫ్యామిలీలో టికెట్ పంచాయితీ మొదలైందనే చెప్పాలి. సోదరుడు బ్రహ్మనంద రెడ్డి పార్టీ బాధ్యతలు చూస్తుండగానే.. విఖ్యాత్ కూడా దూకుడు పెంచారు.
వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన తర్వాత భూమా దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరారు.. పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు భూమా కుటుంబాన్ని విషాదం వెంటాడాయి. శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.. ఆ తర్వాత నాగిరెడ్డి రాజకీయ వారసురాలిగా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి గెలిచారు.. నాగిరెడ్డి నంద్యాలలో విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలో చేరారు. కొంత కాలానికి నాగిరెడ్డి కూడా గుండెపోటుతో కన్నుమూశారు.
నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక రాగా.. భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ బరిలోకి దింపగా.. ఆయన విజయ సాధించారు. చంద్రబాబు భూమా అఖిలప్రియకు ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ.. నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డిలు పోటీచేసి ఓడిపోయారు. అయితే కొంతకాలంగా బ్రహ్మానందరెడ్డి.. భూమా అఖిల, విఖ్యాత్‌ల మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద టీడీపీకి నంద్యాల సీటు పంచాయితీ పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.