టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి 10 మంది అధికారుల టీమ్ తనిఖీలు చేస్తోంది. సీబీఐ ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేత అంశంపై గతంలో కేసు నమోదు చేసిన సంగి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ట్రాన్స్‌స్టాయ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. హవాలా, మనీ లాండరింగ్ ఆరోపణలతో రాయపాటి ఇల్లు, కంపెనీలలో ఈ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటి కంపెనీతో పాటు 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు, హైదరాబాద్‌లో ఈ సోదాలు చేస్తున్నారు.
గతంలో బ్యాంకుల నుంచి రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేయగా.. ఆ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. పలు కంపెనీల్లో పెట్టుబడులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.