తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. అయితే ఆసక్తికరంగా జులై నెలలో వరుసగా నాలుగు సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. ఒక్క సోమవారం మాత్రమే (గత నెలలో 10, 17, 24, 31 తేదీల్లో) హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్‌ను అందుకుంది. జులై 10న తేదీన వెంకన్న హుండీకి రూ.5.11 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ రోజు 64వేల 347మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
జులై 17న చూస్తే.. హుండీకి రూ.5.40 కోట్ల ఆదాయం రాగా.. 71వేల 894మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. జులై 24న కూడా అదే రిపీట్ అయ్యింది..73వేల 796 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ఆదాయం రూ.5 కోట్లు వచ్చింది. గత నెల 31న హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు రాగా.. 68వేల 601మంది స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇలా గత నెల వరుసగా నాలుగు సోమవారాలు ఆదాయం రూ.5 కోట్లు వచ్చింది.
సోమవారం మాత్రమే రూ.5 కోట్లు రావడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవనే చెప్పాలి. వాస్తవంగా తిరుమల శ్రీవారి ఆలయంలో.. నిర్ణీత సమయంలో హుండీలు నిండిన వెంటనే తీసుకెళ్లి లెక్కిస్తారు. భక్తుల రద్దీని బట్టి ఆదాయం వస్తుంది అంటున్నారు.. శని, ఆదివారాలు ఉండే రద్దీతో సోమవారం ఆదాయం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు తిరుమలలో రద్దీ కనిపించింది.. ఆ నెలల్లో కూడా అప్పడప్పుడు రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. గత నెల మాత్రం నాలుగు సోమవారాలు ఈ మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత రద్దీ సాధారణంగా ఉంటోంది.. పండుగలు, ప్రత్యేక దినాల్లో కూడా రద్దీ కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారి హుండీకి సోమవారం సెంటిమెంట్.. నాలుగు వారాలుగా భారీగా ఆదాయం
అంతేకాదు తిరుమల శ్రీవారి హుండీకీ గతేడాది మార్చి నుంచి ప్రతి నెలా రూ.100 కోట్ల మార్కును అందుకుంటోంది. జులైలో కూడా ఈజీగా రూ.100 కోట్ల మార్కు అందుకుంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. అంతేకాదు టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తోంది.. అవసరమైన సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేస్తోంది. అంతేకాదు అవకాశం ఉంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అదనపు కోటాను విడుదల చేస్తోంది.
శ్రీవారి భక్తుల కోసం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాలుగు వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అదనపు టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వేసవి రద్దీ తగ్గడంతో శ్రీవారి దర్శనానికి సాధారణంగా భక్తులు వస్తున్నారని.. అందుకే రూ.300 టికెట్ల అదనపు కోటా ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించగా.. ఇప్పుడు అదనపు కోటాను ఇచ్చారు.