పంచాయితీ ఖాతాల్లో ఉన్న నిధులను జగన్ ప్రభుత్వం దోచేస్తోందని.. దీంతో కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రిని కలిశామని, పంచాయితీ నిధులపై పిర్యాదు చేశామని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని నిధుల దోపిడీపై విచారణకు ఆదేశించి.. చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 8,600 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇవ్వకుండా దోచేసిందన్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సర్పంచుల అంశాన్ని వివరించామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా నిధులు ఇస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచులు ఢిల్లీ వచ్చి సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో సర్పంచుల అంశంపై పోరాటం చేస్తాం.. ప్రశ్నిస్తామని అన్నారు. సర్పంచులకు టీడీపీ ఎంపీల సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.