మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేయడం. దీనిపై సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన న్యాయపోరాటం సాగించారు. ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించి ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు.
ప్రధాని మోదీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై శుక్రవారం స్టే విధించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది. ‘ఇది ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే - జై హింద్’ అని ఈ మేరకు ఆ పార్టీ ట్వీట్ చేసింది.
సూరత్ కోర్టు తీర్పుపై సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట దక్కకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును వెలువరించింది. ‘ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని .. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ ఇచ్చిన తీర్పును నిలిపేయాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే, ఇలాంటి తరహా వ్యాఖ్యలు మంచివి కావని గుర్తు చేసింది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక, రాహుల్ గాంధీ తరఫు వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ .. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు పెట్టినప్పటకీ ఎందులో శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ.. రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని ఆయన తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ.. ‘నీరవ్ మోదీ.. లలిత్ మోదీ’ దొంగలందరిదీ ఒకే ఇంటి పేరా? అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేశారు.