నూహ్ జిల్లాలో అల్లర్లకు కారకులైన నిందితులపై హరియాణా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నూహ్ జిల్లా తావుడులో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను బుల్డోజర్లతో లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు జరుగుతున్న విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అక్రమంగా వలసవచ్చిన వీరు అల్లర్లలో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అసోం నుంచి ఇక్కడకు వచ్చి స్థలాలను కబ్జాచేసి గుడిసెలు నిర్మించినట్లు హరియాణా పట్టణాభివృద్ధి శాఖ చెబుతోంది.
రాళ్ల దాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్నారని, ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సేకరించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు దాడులు చేస్తున్న ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. నల్హార్ గ్రామంలో కూడా ఇటువంటి ఆపరేషన్‌ను పోలీసులు చేపట్టారు. అల్లరి మూక ఈ గ్రామంలో భారీ సంఖ్యలో వాహనాలకు నిప్పంటించిన విషయం తెలిసిందే. నూహ్ అల్లర్లకు కారకులుగా భావిస్తోన్న 50 మంది కుట్రదారులను పోలీసులు గుర్తించారు.
నూహ్ ఎస్పీ వరుణ్ సింగ్లా మాట్లాడుతూ.. స్థానిక అధికారులు కూల్చివేతలను చేపట్టారని, మేము వారికి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా నినాదలు చేసిన వారిపై అధికారులు 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లు జరిగిన మార్గాల్లో అమర్చిన సీసీటీవీల్లో నమోదైన దృశ్యాలను సైబర్ పోలీసుల బృందం సేకరిస్తోంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్యాత్మిక యాత్ర సమయంలో నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా సెలవులో ఉండటంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయనను భివానికి బదిలీ చేసి.. ఏడీజీపీ వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న నరేంద్ర బిజ్రానియాను నూహ్ ఎస్పీగా నియమించింది. నూహ్‌లో యాత్ర సమయంలో వరుణ్ సెలువులో ఉండగా.. పాల్వాల్ ఎస్పీ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. యాత్ర సమయంలో ఇక్కడ జరిగిన దాడులు.. ఆ తర్వాత మత విద్వేషాలుగా మారి ఇతర ప్రాంతాలకు కూడా పాకిన విషయం తెలిసిందే.