ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది.. మొన్నటి వరకు వానలు దంచికొడితే మళ్లీ ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం ఎండాకాలాన్ని గుర్తు చేస్తోంది.. కొన్నిచోట్ల ఉక్కపోత వాతావరణం ఉంది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా ఉన్నాయి.. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గొర్రెలమిట్టలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మిగిలిన జిల్లాల విషయానికి జంగమహేశ్వరపురం, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలకు పైగా పెరిగాయి. విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 39.79, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 39.75.. అలాగే అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో 39.49, తిరుపతి జిల్లా సత్యవేడులో 39.28, పార్వతీపురం మన్యం జిల్లా పెదమేరంగిలో 39.13, చిత్తూరు జిల్లా కత్తెరపల్లిలో 39.09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే దాదాపు ఎండాకాలంలో పరిస్థితే ఉంది.
ఎండల సంగతి అలా ఉంటే.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవడం విశేషం. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఆగస్టు నెలలో విచిత్రంగా ఎండలు పెరగడం ఆసక్తికరంగా మారింది.. అయితే ఈ నెల 2న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఏపీపై ప్రభావం ఉంటుందని భావించారు.. కానీ అలా జరగలేదు. విచిత్రంగా ఎండలు మొదలయ్యాయి.
మరోవైపు ఏపీలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఈ మేరకు వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నీరు చేరిన కచ్చా ఇళ్లకు రూ.10 వేల చొప్పున సాయం అందించాలని సూచించారు. ఎవరికైనా అందకపోతే మళ్లీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంట్లోకి వరద నీరు రాకున్నా.. గ్రామంలోకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, పాలు, కిలో చొప్పున కూరగాయలు, కందిపప్పు, వంటనూనె లాంటి సరకులు అందించాలన్నారు.
విమర్శలకు తావు లేకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలు జరగాలన్నారు సీఎం. సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని.. మానవత, సానుభూతితో ఉండాలన్నారు. వరద నీరు పూర్తిగా తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని.. మిగిలిన ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తరలించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, విలేజి క్లినిక్‌లలో మందులు ఉండేలా చూడమన్నారు.. పాము కాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే పంట, ఆస్తి నష్టాన్ని గుర్తించి.. వారి జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ఉంచాలన్నారు. పశువులకు గ్రాసం కొరత లేకుండా చూడాలని.. వరదలతో దెబ్బతిన్న కల్వర్టులు, ఇతర నిర్మాణాల మరమ్మతుల్ని వెంటనే చేపట్టాలన్నారు.
మరోవైపు ఏటిగట్ల మీద ఉన్న వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉండే వారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలని.. పోలవరం ప్రాజెక్ట్ ఎగువన తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలకు పునరావాస కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పునరావాస శిబిరాల్లో ఉన్నవారు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వమని ఆదేశించారు. తాను సోమ, మంగళవారాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. తాను ఏ జిల్లాకు వచ్చినా.. కలెక్టర్ బాగా చేయలేదనే మాట రాకూడదన్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబం కూడా తన దగ్గరకొచ్చి తమకు సాయం అందలేదని చెప్పకూడదన్నారు. బాధితులతో నేరుగా మాట్లాడతాను అన్నారు.