విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మెంటాడ గ్రామంలో 2018లో నమోదైన హత్య కేసులో నిందితుడు రాయిపల్లి అచ్చయ్యకు జీవిత ఖైదు విధిస్తూ ఫోర్త్ ఏడీజే ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి షేక్ సికిందర్ బాషా సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఆండ్ర ఎస్‌ఐ సిద్ధార్థకుమార్ తెలిపారు. మెంటాడ గ్రామం ఎగువ వీధిలో నివాసం ఉంటున్న కొల్లి కొండమ్మ తన భర్త సత్యనారాయణతో కలిసి వివాహం అనంతరం కన్నవారింటికి ఇల్లరికం వచ్చారు. కూతురు కొండమ్మకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సమ్మతించక కుటుంబ సభ్యులు అచ్చియ్య, రాయిపల్లి సీతమ్మ, మరదలు గౌరమ్మ ఆస్తి ఇచ్చేందుకు వ్యతిరేకించారు. ఆస్తి విషయమై కుటుంబ సభ్యుల మధ్య 2018 జూన్ 3న వివాదం చలరేగి నిందితులు భర్త కొల్లి సత్యనారాయణను హత్య చేసినట్లు 4న కొల్లి కొండమ్మ ఫిర్యాదు చేశారు. ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడు రాయపల్లి అచ్చయ్యపై నేరారోపణలు రుజువు కావటంతో జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఏ2 సీతమ్మ, ఏ3 గౌరమ్మలపై నేరారోపణలు రుజువు కావటంతో నిర్ధోషులుగా పరగణిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్‌ఐ తెలిపారు.