ఎవరైనా తమ పనికి ఆటంకం కలిగిస్తే.. తమను వేధిస్తే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా పోలీసులనే వేధించాడు. ఓ మహిళా కానిస్టేబుల్‌కు పదే పదే ఫోన్లు చేస్తూ విసిగించేవాడు. అలాగని ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్‌కే ఫోన్ చేసి విసిగించేవాడు. తరచూ ఫోన్లు చేసి ఆ మహిళా కానిస్టేబుల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. లైంగిక విషయాల్లో సాయం చేయాలని కోరేవాడు. అయితే ఒకరోజో రెండు రోజులో.. ఒకసారో రెండు సార్లో కాకుండా ఏకంగా 300 సార్లు ఫోన్ చేశాడు. విన్న మనకే ఇంత చిరాకుగా ఉంటే ఇక ఆ మహిళా కానిస్టేబుల్ ఎంత ఇబ్బంది పడిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓపిక పట్టి వేచి చూసిన ఆ మహిళా కానిస్టేబుల్ చివరికి అతడ్ని పట్టుకుంది. ఈ ఘటన కేరళలో జరిగింది.
కేరళలోని కొచ్చి పోలీస్ స్టేషన్‌కు తరచూ ఫోన్ కాల్స్ వచ్చేవి. అయితే అందులో చాలా ఫోన్లు ఓ యువకుడే చేసేవాడు. ఆ పోలీస్ స్టేషన్‌లో ఉండే మహిళా పోలీస్‌తో మాట్లాడేందుకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇలా తరచూ దాదాపు 300 సార్లు ఆ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్లు చేస్తూ విసిగించే వాడు. లైంగిక విషయాల్లో తనకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసేవాడు. ఇలా తరచూ ఆ మహిళా పోలీస్ కోసం ఫోన్లు చేయడంతో ఆ మహిళా కానిస్టేబుల్ సహా స్టేషన్ సిబ్బంది మొత్తం తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో వారు విసుగు చెందిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. అనంతరం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన కేరళ కోర్టు నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు మరో రూ.15 వేల జరిమానా కూడా వేసింది. ఈ మేరకు ఎర్నాకులం అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాజిని బీఎస్ కీలక తీర్పు వెలువరించారు. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు చేసిన ఫోన్ కాల్స్ వల్ల మహిళా కానిస్టేబుల్ సహా స్టేషన్‌లోని మిగితా సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గమనించామని తెలిపింది. నిందితుడు పదే పదే ఫోన్ కాల్స్ చేయడం వల్ల ఆపదలో ఉండి పోలీసుల సాయం కోసం ఫోన్లు చేసిన ప్రజలు కూడా ఇబ్బంది పడి ఉంటారని వ్యాఖ్యానించింది. ఇలాంటి సంఘటనలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని.. నిందితులను కూడా వదలకూడదని పేర్కొంది. ఇలా చేసే వారిని క్షమించి వదిలేస్తే మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. అందుకే నిందితుడికి మూడేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధించినట్లు సాజిని బీఎస్ తీర్పులో పేర్కొంది.