మార్కెట్లో గత రెండు నెలల నుంచి రోజు రోజుకూ ధర కొండెక్కి కూర్చుంటోంది. జూన్ నెల ప్రారంభంలో కిలో రూ.30లోపు ఉన్న టమాటా.. ఆ నెల రెండో వారం నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం డబుల్ సెంచరీ దాటేయడంతో టమాటా కొనే ఆలోచనను సామాన్యులు విరమించుకుంటున్నారు. ధరలకు రెక్కలు రావడంతో దేశంలోని పలుచోట్ల టమాటా దొంగతనం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో టామాటా ధరలపైనే చర్చలు జరుగుతున్నాయి. టమాటాలతో వెళ్తోన్న ట్రక్కులు మిస్సింగ్, పొలాల్లోకి చొరబడి పంటను ఎత్తుకెళ్లడం వంటివి జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ రైతు తెలివిగా వ్యవహరించాడు. తనకు అలాంటి పరిస్థితి రాకుండా టమాటా సాగుచేస్తోన్న పొలంలో ఏకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన శరద్ రావత్ అనే రైతు.. తన పొలంలో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా రక్షణగా సీసీ కెమెరాలతో నిఘా పెట్టాడు. టమాటా ధరలు రికార్డుస్థాయికి చేరడంతో చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని, అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశానని రావత్ తెలిపారు. ఇందుకోసం రూ. 22 వేలు ఖర్చయ్యిందని ఆయన పేర్కొన్నాడు.
ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో టమాటా రూ.160గా ఉంది. దేశంలో టమాటాలు చోరీకి గురవుతున్న విషయం తెలిసిందే. సోమవారం కర్ణాటకలోని కోలారు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు టమాటాల లోడుతో వెళ్తోన్న ట్రక్ అదృశ్యమైంది. అందులో సుమారు రూ. 21 లక్షల విలువైన టమాటాలు ఉన్నాయి. మరో ఘటనలో ఝార్ఘండ్ కూరగాయల మార్కెట్‌లో 40 కిలోల టమాటాలను దొంగిలించారు. ఒక్క టమాటాయే కాదు కూరగాయలు ధరలన్నీ మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుడి వంటింటి బడ్జెట్ రెండింతలు పెరిగిపోయింది. ఇక, కొనేవాళ్లు కరువై ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని కూరగాయలు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
టమాటా ధర చాలా ఎక్కువగా ఉందని, అందుకే వాటిని కొనే సాహసం చేయడం లేదని ఓ వ్యాపారి వాపోయాడు. ఇక, నెల రోజుల్లో రీటెయిల్ ధరలు 300 శాతం మేర పెరిగాయి. ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించినా.. అవేమీ సామాన్యులకు ఊరట కలిగించడం లేదు. గతవారం తగ్గినట్టే తగ్గిన టమాటా.. మళ్లీ రూ.200కు చేరింది. ఆగస్టు 1 నాటికి కిలో టమాటా సగటు ధర రూ.120 ఉండగా.. కేవలం వారం రోజుల్లోనే ఇది రూ.132.5కి చేరడం గమనార్హం.