మోదీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో అనర్హత వేటు రద్దయింది. దీంతో తిరిగి రాహుల్ గాంధీకి పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. అనర్హత వేటు రద్దుకావడంతో రాహుల్ గాంధీ నాలుగు నెలల అనంతరం పార్లమెంట్‌లోకి సోమవారం అడుగుపెట్టారు. తాజాగా, వాయనాడ్ ఎంపీకి బంగ్లాను కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న బంగ్లానే లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించినట్టు పేర్కొన్నాయి.
పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన తర్వాత లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక బంగ్లాను రాహుల్ ఖాళీ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి ఏప్రిల్‌లో లోక్‌సభ హౌస్ కమిటీ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఆ బంగ్లాను ఖాళీ చేశారు. 2005 నుంచి రాహుల్ ఆ బంగ్లాలో ఉన్నారు. మళ్లీ అదే బంగ్లాను కేటాయిస్తూ హౌస్ కమిటీ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించడంతో ఆ బంగ్లా కేటాయిస్తారా? లేదా? అనే సందిగ్ధత ఉండగా.. లోక్‌సభ హౌస్ కమిటీ దానినే కేటాయించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తన అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్తూ.. నిజం మాట్లాడినందుకు శిక్ష వేశారు.. దేశ ప్రజలు తనకు ఇచ్చిన బంగ్లాను లాగేసుకున్నారని, ఇక ఆ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరించిన తర్వాత ఆయనకు తుగ్లక్ రోడ్డులో ఉన్న బంగ్లానే తిరిగి కేటాయించాలని.. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పార్లమెంట్ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు. అయితే, రాహుల్ గాంధీ ఖాళీ చేసిన తర్వాత ఆ బంగ్లాను ఎవరికీ ప్రభుత్వం కేటాయించకపోవడంతో తిరిగి ఆయనకే ఇచ్చినట్టు తెలుస్తోంది.