ఎర్ర సముద్రంలో అగ్రరాజ్యం అమెరికా (USA) బలగాలను భారీగా మోహరించింది. ఎర్ర సముద్రంలోని అమెరికా వాణిజ్య నౌకను ఇటీవల ఇరాన్ స్వాధీనం చేసుకోవడంతో ఆ ప్రాంతంలో పట్టు సాధించేందుకు అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 3000 మంది సైనికులను రెండు యుద్ధ నౌకల్లో ఎర్ర సముద్రంలోకి పంపినట్లు అమెరికా నేవీ వెల్లడించింది. ఆదివారం ఈ దళాలు అక్కడకు చేరుకున్నాయి. ‘అమెరికా నావికులు, మెరైన్లు ఆదివారం సూయిజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించారు’ అని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
యూఎస్‌ఎస్ బటాన్, యూఎస్‌ఎస్ కార్టర్ హాల్ యుద్ధ నౌకలు వీరికి సాయంగా ఉంటాయని తెలిపారు. గడచిన రెండేళ్లుగా ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ దాదాపు 20 నౌకలను స్వాధీనం చేసుకుందని అమెరికా నేవీ ఆరోపణలు చేసింది. తాజాగా, జులై 5న ఒమన్‌కు వెళ్తోన్న రెండు వాణిజ్య ట్యాంకర్లను స్వాధీనం చేసుకునేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలను తమ బలగాలు తిప్పికొట్టాయని అమెరికా తెలిపింది. ఈ పరిస్థితుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటు సముద్ర జలాలపై మరింత పట్టు సాధించేందుకు అమెరికా పెద్ద ఎత్తున బలగాలను అక్కడికి పంపింది.
కానీ, ఇరాన్ ఇందుకు భిన్నంగా వాదిస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న రెండు నౌకల్లో ఒకటైన బహమియన్ రిచ్‌మండ్ వాయేజర్ వాణిజ్య నౌక ఇరాన్ నౌకను ఢీ కొట్టిందని పేర్కొంది. అందులోని ఐదుగురు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయని అందుకే వాటిని అడ్డుకున్నామని అంటోంది. మరోవైపు, గత ఏప్రిల్, మే నెల ప్రారంభంలో అమెరికాకు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లను కూడా ఇరాన్ సీజ్ చేసింది.
ఒమన్‌కు ముడిచమురును తీసుకెళ్తున్న ఇజ్రాయిల్‌కు చెందిన ఓ నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసినట్టు నవంబరులో అమెరికా, ఇజ్రాయిల్‌లు ఆరోపించాయి. ఆ తర్వాతే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరిస్థితుల్లో తమదేశ వాణిజ్య నౌకలకు పటిష్ఠ భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే అమెరికా ఎర్రసముద్రంలో సైనికులను మోహరించినట్లు తెలుస్తోంది. అమెరికా గతంలో పశ్చిమాసియాకు ఆంఫిబియస్ రెడీనెస్ గ్రూప్‌తో పాటు డిస్ట్రాయర్, ఎఫ్-35, ఎఫ్-16 యుద్ధ విమానాలను మోహరించే ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ డ్రోన్లు, 1,000 కి.మీ. లక్ష్యాలను చేరుకునే క్షిపణులతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది. ‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంతో అమెరికాకు సంబంధం ఏమిటి? ఇక్కడ మీ వ్యాపారం ఏమిటి?’ అని ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ఫజల్ షేఖ్చరి అన్నారు.