ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్ జాతీయరహదారిపై విరిగిపడ్డ కొండచరియలు,,,అమర్‌నాథ్ యాత్ర రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 10:26 PM

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బుధవారం అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు పేర్కొన్నారు. పంథా చౌక్ యాత్ర బేస్ క్యాంప్ నుంచి జమ్మూ వరకు కూడా యాత్రను నిలిపివేశామని, జాతీయ రహదారిని క్లియర్ చేసిన తర్వాత వాహనాల రాకపోకలు పునఃప్రారంభిస్తామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు T2 మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు వివరించారు.


‘టీ2 మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మూసుకుపోయింది.. ఈ మార్గంలో ప్రయాణాలను రద్దు చేసుకోవాలి.. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ ధ్రువీకరించిన తర్వాత ప్రయాణాలు చేయండి’ అని జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జులై 1న మొదలుకాగా.. ఆగస్టు 31న ముగియనుంది.


స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆగస్ట్ 17న ప్రారంభం కానున్న బుద్ద అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్, జమ్మూ డివిజనల్ కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ‘జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్, జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్, రాజౌరి పూంచ్ రేంజ్ డీఐజీ హసీబ్ మొఘల్‌తో కలిసి పోలీసు, సివిల్ అడ్మినిస్ట్రేషన్‌తో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, బుద్ధ అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 17, 2023 నుంచి ప్రారంభమవుతుంది’ అని జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రకటనలో తెలిపారు. జమ్మూ ఏడీజీపీ, డివిజనల్ కమిషనర్‌కు భద్రత, ఇతర సంబంధిత సమస్యల గురించి SSP పూంచ్ వినయ్ కుమార్, పూంచ్ డీసీ యాసీన్ మహ్మద్ చౌదరి వివరించారు. అనంతరం పూంచ్‌లోని పౌర సంఘం సభ్యులతో ఏడీజీపీ, డివిజనల్ కమిషనర్ సమావేశమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com