భారత్‌లో తయారైన దగ్గు మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో తయారైన సిరప్‌లో మోతాదుకు మించి డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నాయని, ఇది సురక్షితం కాదని హెచ్చరించింది. చెన్నైకి చెందిన ఫోర్ట్స్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేసిన ఈ దగ్గు మందును ఇరాక్‌లో విక్రయిస్తున్నారు. ఆ దేశానికి చెందిన డాబిలైఫ్ ఫార్మా ఈ దగ్గు మందును మార్కెటింగ్ చేస్తోంది.
కోల్డ్ అవుట్ నమూనాల్లో డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్‌లు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో తాజాగా వెల్లడించింది. దీని వినియోగం ఏ మాత్రం సురక్షితం కాదని, ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సిరప్‌ను ఉపయోగిస్తే తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. దగ్గు సిరప్‌లో డైథిలీన్, ఇథలీన్ వినియోగానికి పరిమితి 0.10 శాతం. కానీ, కోల్డ్ అవుట్‌లో 0.25 శాతం డైథిలీన్, 2.1 శాతం ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఈ సిరప్ భద్రత, నాణ్యత గురించి తాము అడిగిన వివరాలను సైతం సదరు కంపెనీ సమర్పించలేదని డబ్ల్యూహెచ్‌వో ఆరోపించింది. ఈ ఆరోపణలపై ఫోర్ట్స్ ల్యాబొరేటరీ ఇంకా స్పందించలేదు. అయితే, ఇటీవలి కాలంలో భారత్‌లో తయారైన సిరప్ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కోల్డ్ అవుట్ సహా భారత్‌లో తయారైన ఐదు దగ్గు మందులు డబ్ల్యూహెచ్‌వో పరిశీలనలో ఉన్నాయి.
గతంలో భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌లను ఉపయోగించడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లో 89 మంది చిన్నారులు మృత్యవాతపడ్డారు. దీంతో ఆ సిరప్‌ను సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్‌లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన మధ్యప్రదేశ్‌లోని రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. ఇందులోనూ మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది.
భారత్‌లో తయారైన దగ్గు మందులపై ఆరోపణలు ఉన్నప్పటికీ దేశ ఔషధ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో 27 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయి. ఇది గత సంవత్సరం కంటే దాదాపు రెండింతలు వేగంగా పెరుగుతోంది. భారత్ ఫార్మా ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 3.25 శాతం పెరిగి 25.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 6.3 శాతం వృద్ధి చెంది 27 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకోవచ్చని అంచనా.