ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కావాలని రెచ్చగొట్టారంటూ,,,పుంగనూరు దాడులపై సీఎం జగన్ ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 06:28 PM

చంద్రబాబు రూట్ మార్చి పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి కానిస్టేబుల్ కళ్లు పొగొట్టారని, 47 మంది పోలీసులు గాయపడేలా చేశారని విమర్శించారు. శవ రాజకీయాలకు కూడా చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ వెనుకాడటం లేదని, అలాంటి రాక్షసులకు ప్రభుత్వం ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టడమే చంద్రబాబు, పవన్ పవన్ పని అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఇవాళ మధ్యాహ్నం కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సొమ్మును సీఎం జగన్ జమ చేశారు. 9.48 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు 1,353.76 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. 2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని, గతంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.14,205 కోట్లు చెల్లించలేదన్నారు. చంద్రబాబు మోసానికి ఏ,బి గ్రేడ్ సంఘాలు సి,డీ గ్రేడ్‌కు దిగజారాయని, డ్వాక్రా మహిళలు రూ.3 వేల కోట్లకుపైగా ఎదురు కట్టాల్సి వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందాయా? అని ప్రశ్నించారు.


'చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయముందా..? బాబు హయాంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు రాజకీయంగా ఎదిగారా..? టీడీపీ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశారా? పేద బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వద్దని బాబు అడ్డుపడుతున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే అడ్డుకున్న చరిత్ర బాబుకే ఉంది. బాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తుకొస్తుందా? బాబు లాంటి వ్యక్తిని సీఎం కుర్చీలో ఎందుకు కూర్చొబెట్టాలి? బాబును సీఎం చేయడానికి దత్తపుత్రుడు ఎందుకు తపిస్తున్నాడో అర్ధం కావట్లేదు. బాబు అధికారంలోకి వస్తే గిట్టనివారికి నరకం చూపిస్తాడట' అని సీఎం జగన్ పేర్కొన్నారు.


'బాబు సీఎం అయితే ప్రజలకు మంచి జరుగుతుందో.. లేదో ఆలోచన చేయాలి. దళితులకు బాబు నరకం చూపించారు. బీసీలను తాట తీస్తానంటూ బాబు బెదిరించారు. బీసీలకు 134 వాగ్ధానాలు ఇచ్చి బాబు వెన్నుపోటు పొడిచారు. మైనార్టీలకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయలేదు. రూ.85 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని బాబు మోసం చేశారు. ఎన్నికలైన తర్వాత ప్రజలను మోసం చేయడమే బాబుకు తెలుసు. దోచుకోవడం మాత్రమే చంద్రబాబుకు బాగా తెలుసు' అని జగన్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com