టీటీడీ పాలకమండలి నియామకం నేడు సాయంత్రం, రేపు జరిగే అవకాశముందని తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్‌గా గురువారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఇవాళ లేదా రేపు కొత్త టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ప్రకటించే అవకాశముందని సమాచారం. దీంతో పాలకమండలిలో చోటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఏపీకి చెందినవారితో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకు చెందినవారికి పాలకమండలి సభ్యులుగా అవకాశం కల్పించనున్నారు. ఈ క్రమంలో రేసులో పలువురి నేతలతో పాటు వ్యాపారుల పేర్లు వినిపిస్తున్నాయి.
మొత్తం 24 మందితో పాటు ముగ్గురు ఎక్స్‌అఫీషియా సభ్యులను నియమించనున్నారు. మహారాష్ట్ర నుంచి ముగ్గురికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోండగా.. తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ఫార్మా అధినేతకు చోటు దక్కనుందని సమాచారం. ఇక ఏపీ నుంచి ఎమ్మెల్మేల కోటాలో మాజీ మంత్రి పేర్ని నాని, ద్వారంపూడి, అలజంగి జోగారావులను నియమించనున్నారని సమాచారం. అలాగే పశ్చిమగోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు, రాయలసీమ నుంచి ఆనందరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి సిద్దరామయ్య కోటాలో దేశ్ పాండే పేరు, తమిళనాడు నుంచి స్టాలిన్ కోటాలో తిరుపూర్ బాలా పేర్లు రేసులో వినిపిస్తున్నాయి.
ఇక ఏపీ గవర్నర్ కోటాలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాధ్‌కు అవకాశం దక్కనుందని సమాచారం. పాలకమండలి సభ్యుల కోసం చాలామంది ఆశావాహులు రేసులో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం ఇతర రాష్ట్రాల ప్రముఖులు, నేతలు కూడా భారీగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ పదవులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఏపీకి చెందినవారే అధికంగా ఉండే అవకాశముంది. దీంతో వైసీపీలోని పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా పాలకమండలిలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పాకలమండలి సభ్యుల నియామకం కోసం కసరత్తు పూర్తవ్వగా.. నేడు సాయంత్రం లేదా శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. 2019 జూన్ 21న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా.. మూడు నెలల తర్వాత పాలకమండలిని నియమించారు. 2021 జూన్ 26న స్పెసిఫైడ్ అధారిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైవీ సుబ్బారెడ్డి పదవికాలం ముగియడంతో టీటీడీ 53వ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.