ఏపీలో టమాటా ధరలు దిగొస్తున్నాయి. గతవారం రూ.200పైగా పలికిన ధర ఇప్పుడు.. నెలకు చూస్తోంది. గత రెండు, మూడు రోజుల్లోనే దారుణంగా పడిపోయింది. రెండు రోజులుగా 50 కంటే దిగువకు వస్తోంది.. ఇవాళ ధర మరీ దారుణంగా తగ్గింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కేజీ రూ.33కు దిగిపోయింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు మార్కెట్‌లలో ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ ధర ఇంకా తగ్గిపోతుందా అనే చర్చ జరుగుతోంది. అదే కనుక జరిగితే రైతులకు మళ్లీ కష్టాలు మొదలైనట్లే.
టమాటా ధరలు తగ్గడానికి దిగుబడి పెరగడమే కారణం అంటున్నారు వ్యాపారులు. చిత్తూరు జిల్లాతో పాటుగా పక్క జిల్లాల్లో, పొరుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి పెరగడంతో టమాటా పంట భారీగా మార్కెట్‌కు వస్తోంది. ఈ పంట కోసం బయ్యర్ల నుంచి కూడా పోటీ లేదట.. దీంతో గిరాకీ తగ్గి టమాటాల ధర పడిపోతోందని అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు టమాటా పేరు చెబితే వణికపోయిన సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశం కాగా.. రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
టమాటాల ధరలు అమాంతం పెరగడంతో జనాలు ఇబ్బంది పడ్డారు.. కానీ టమటా రైతులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది.. కొందరు అన్నదాతలు ఏకంగా కోటీశ్వరులయ్యారు. ఇలా మొన్నటి వరకు కోట్లాదా రూపాయల లాభాలు చూసిన అన్నదాతలు.. ఇప్పుడు ధరలు దారుణంగా పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం కూడా కేజీ రూ.200 వరకు పలికింది.. ఈ ధర రూ.300 వరకు వెళుతుందేమోనన్న భయం మొదలైంది. అయితే టామాట పంట దిగుబడి పెరగడంతో రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మొత్తం తలకిందులైందని రైతులు అంటున్నారు. ఈ ధరలు ఇంకా తగ్గిపోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో మొదలైంది.
టమాటా రైతులకు మొదటి నుంచి కష్టాలనే చెప్పాలి. ఒకప్పుడు టమాటాలను మార్కెట్‌లో కొనేవారు లేక రోడ్లపై పారబోసిన సందర్భాలను చాలానే చూశాం. కొందరు రైతులు కేజీ రూపాయికి.. మరీ దారుణంగా ఐదు కేజీలను రూ.2కే ఇచ్చిన ఘటనలు చాలానే జరిగాయి. కానీ ఉన్నట్టుండి టమాటాల ధరలు పెరగడంతో తమకు మంచి రోజులు వచ్చాయని అన్నదాతలు సంబరపడ్డారు. ఆ ఆనందం ఎన్నో రోజులో నిలువలేదు.. నెల రోజుల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరి రాబోయే రోజుల్లో టమాటా ధరల పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి.