వజ్రాల వేటలో ఆ కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. ఇన్నాళ్ల వెతుకులాట ఫలించి ఓ వజ్రం దొరికింది. అది మామూలు వజ్రం కాదు. ఆరు ముఖాలున్న షడ్భుజి వజ్రం. సాధారణ వజ్రంతో పోలిస్తే దీనికి డిమాండ్ ఎక్కువ. దీంతో మార్కెట్లో ఈ వజ్రం రూ.60 లక్షలు పలుకుతుందని అంచనా. ఇంతకూ వజ్రం ఎవరికి ఎక్కడ దొరికింది అనుకుంటున్నారా..? ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో ఓ వ్యక్తికి ఈ వజ్రం దొరికింది. సత్తెనపల్లి సమీపంలోని బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం వజ్రాలు వెతకడం కోసం గుడిమెట్లకు వచ్చింది. వెతకగా వెతకగా.. వారికి ఈ అరుదైన వజ్రం లభ్యమైంది. రూ.60 లక్షల వరకు ఈ వజ్రం ధర పలుకుతుందని అంచనా కాగా.. రూ.40 లక్షల వరకు ఇచ్చేందుకు స్థానిక వ్యాపారులు మందుకొస్తున్నారు. కానీ అంత కంటే ఎక్కువే ధర పలుకుతుందనే ఉద్దేశంతో.. ఆ కుటుంబాన్ని ఇంకా వజ్రాన్ని విక్రయించలేదు.
గతంలో గుడిమెట్ల ప్రాంతాన్ని రాజులు పాలించారు. దీంతో ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇక్కడ వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి. దీంతో వర్ష కాలం వచ్చిందంటే చాలు... ఎన్నో ఏళ్లుగా గుడి మెట్ల కొండపై జనం వజ్రాల వేట సాగిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఇక్కడికొచ్చి వజ్రాల కోసం వెతుకుతుంటారు. భోజనాలు తెచ్చుకొని మరీ ఇక్కడ వజ్రాల కోసం జల్లెడ పడుతుంటారు. రాత్రి వేళల్లోనూ ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది. ఇటీవల ఒక్క రోజే మూడు వజ్రాలు దొరికాయని ప్రచారం జరిగింది. దీంతో వజ్రాల వేట కోసం గుడిమెట్లకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.
ఏపీలోని కర్నూలు జిల్లాలోనూ వర్షా కాలం వజ్రాల వేట కొనసాగుతుంది. వర్షం పడితే వజ్రాలు పైకి వస్తాయని భావిస్తారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడి రాయి, ఎర్రగుడి, ఉప్పరపల్లి గ్రామాలతోపాటు.. మద్దికేర మండలంలోని వజ్రాల బసినేపల్లి, పెరవలి, మదనంతాపురం గ్రామాల్లో జనం వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. జూన్ నెలలో బసినేపల్లిలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా.. రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది.