ఆందోనకారులు తమ సమస్యల గురించి వివిధ రకాలుగా నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది శాంతియుతంగా నిరసనలు చేస్తే.. మరికొంతమంది పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతారు. ఇక మరికొంతమంది వినూత్న పద్దతుల్లో నిరసనలు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. మరికొన్నిసార్లు ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటూ ఉంటాయి. దాడులు చేసుకోవడం, పోలీసులు లాఠీఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో గొల్ల కాపరుల కుటుంబాలు వినూత్నంగా నిరసన తెలపడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో గొర్రె కాపర్ల కుటుంబాలు వినూత్నంగా తమ నిరసన చేపట్టాయి. గొల్లపల్లి గ్రామం కొండ పోరంబోకు భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గొర్రెలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 100 కుటుంబాలు కలిసి ఏకంగా 10 వేల గొర్రెలను ఎమ్మార్వో కార్యాలయం ముందుకు తోలుకొచ్చారు. అనంతరం అక్కడ కూర్చుని నిరసన తెలియజేశారు. బ్యానర్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్‌ను తెలుపుతున్నారు. అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చామని, అయినా పట్టించుకోలేదని వాపోతున్నారు.
ఆర్డీవో, కలెక్టర్లు వచ్చి భూమిని పరిశీలించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము విసిగి పోయామని, అందుకనే ఇలా వినూత్నంగా నిరసన చేస్తున్నట్లు గొర్రె కాపరుల కుటుంబాలు తెలిపాయి. తమ సమస్యను పరిష్కరించేవరకు ఇలాగే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్వో కార్యాలయం ముందుకు పెద్ద సంఖ్యలో గొర్రెలను తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వినూత్న నిరసనను చూసి కొంతమంది షాక్ అవుతున్నారు.