ఓవైపు తిరుమల నడకదారి మార్గంలో భక్తుల్ని చిరుతలు, ఎలుగుబంటుల భయం వెంటాడుతుంటే.. ఇటు శ్రీశైలంలో కూడా అదే సీన్ కనిపించింది. శ్రీశైలంలో శిఖరం దగ్గర ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. గత మూడు రోజుల నుంచి శిఖరం దగ్గరికి వచ్చి వెళ్తోంది. శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన నూగులు, కొబ్బరి తినేందుకు తరచూ వస్తోంది.. అక్కడ ఆహారం తిని వెళ్లిపోతోంది. ఆదివారం రాత్రి కూడా శిఖరం దగ్గరకు వచ్చింది.. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటిని చూసి భయపడ్డారు.
సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటి రావడం, వెళ్లడాన్ని మొబైల్‌లో రికార్డు చేశారు. గత మూడు రోజులుగా ఎలుగుబంటి తరచుగా వస్తున్నట్లు చెబున్నతారు. ఈ ఘటనపై స్పందించి.. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి శిఖరం వైపుగా రాకుండా ప్రయత్నిస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. శిఖరం దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది కూడా భయపడుతున్నారు. అంతేకాదు శిఖర దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో ఈ ఎలుగుబంటి సంచరిస్తుందని చెబుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలుమార్లు ఎలుగుబంటి సంచరించడంతో భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.