ఎంతో మంది అనాథలు, అంగవైకల్యం గల పిల్లలకు దేవుడు.. కన్న పిల్లలే వదిలించుకున్న తల్లిదండ్రులకు భరోసా. అలాంటి మానవతామూర్తి దారుణంగా హత్యకు గురయ్యారు. అది కూడా సొంత తమ్ముడు, మరదలి చేతిలో.. కడప జిల్లా ప్రొద్దుటూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్మన్, డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డి (Daddy Home Raja Reddy) అనుమానాస్పద మృతి కేసులో వెలుగు చూసిన దారుణమిది. సొంత తమ్ముడు శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య ప్రసన్న కలిసి రాజారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించినట్లు తెలిపారు. రాజారెడ్డి ఆస్తిపై కన్నేసిన నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. రాజారెడ్డి హత్యకు నెల కిందటే కుట్ర పన్నినట్లు విచారణలో గుర్తించారు.
ప్రొద్దుటూరు - జమ్మలమడుగు మార్గంలో ఉన్న పూజా హైస్కూల్‌లో ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటలకు పాఠశాల ఆవరణలోనే నిందితులు రాజారెడ్డిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గొంతు నులిమి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత రాజారెడ్డి గుండెపోటుకు గురై కుప్పకూలారంటూ.. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఒకరు, మరో ఇద్దరు కిరాయి వ్యక్తులు ఈ కుట్రలో నిందితులకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులతో చేతులు కలిపిన ఓ వైద్యుడు.. రాజారెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు నివేదిక ఇచ్చాడు. దీంతో మృతదేహాన్ని మైలవరంలోని డాడీ హోంకు తరలించారు. అక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు రాజారెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
నిందితులపై అనుమానం వ్యక్తం చేస్తూ.. బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలతో మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించడంతో ఈ నిజాలు బయటపడ్డాయి. గొంతునులుమి, ఊపిరాడకుండా చేయడం వల్లే రాజారెడ్డి మరణించారని రీపోస్ట్‌మార్టంలో వెల్లడైంది. రాజారెడ్డి తమ్ముడు శ్రీధర్ రెడ్డి, ఆయన భార్య ప్రసన్న, వారికి సహకరించిన మరో ఇద్దరు కిరాయి వ్యక్తులు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘రాజా’ పౌండేషన్ పేరుతో రాజారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2001లో ‘డాడీ హోం’ ఏర్పాటు చేశారు. ఈ హోంలో అనాథలు, వీధి పిల్లలు, హెచ్.ఐ.వి. బారిన పడిన చిన్నారులు, అత్యాచార బాధితులు, మానసిక వికలాంగులు, వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. నిందితురాలు ప్రసన్న ‘డాడీ హోమ్ ఫౌండేషన్’కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.