మహరాష్ట్రలోని నవీ ముంబైలో ఆలయ నిర్మాణం చేపట్టిన ప్రదేశం పర్యావరణ హితం కాదని కేంద్రం అభ్యంతరం పెట్టేవరకూ టీటీడీ ఏం చేసింది? తాము నిర్మాణం చేపట్టిన స్థలం పరిస్థితి ఏమిటో పరిశీలన చేసే తెలివి టీటీడీకి లేకుండా పోవడం దురదృష్టకరం. రుషికొండలో ఏపీ ప్రభుత్వం తవ్వుకొంటూ పోయిన మాదిరిగా తామూ పోదామని అనుకొన్నట్లు కనిపిస్తోంది’’ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ... ‘‘నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో రూ.70 కోట్లతో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ ఏడాది జూన్ ఏడో తేదీన టీటీడీ శంకుస్థాపన చేసింది. మడ అడవుల్లోని 16 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం కాస్టింగ్ యార్డ్ నిర్మాణం కోసం ఎల్‌అండ్‌టీ సంస్థకు కేటాయించింది. అందులోనే 10 ఎకరాలు ఆలయ నిర్మాణానికి టీటీడీకి ప్రభుత్వం ఇచ్చింది. మడ అడవుల ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధం. అక్కడ పర్యావరణపరంగా నిషేధాలు ఉన్నాయని టీటీడీకి రెండేళ్ల కిందటే తెలుసు. అయినా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. కేంద్రానికి ఫిర్యాదులు కూడా అందాయి. దీనితో అక్కడ ఆలయ నిర్మాణ ప్రణాళికపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ అయినట్లు మహరాష్ట్ర పత్రికల్లో వార్తలు వచ్చాయి. అక్కడ 40 వేల చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. కాని 11 వేల అడుగుల్లో మాత్రమే చేపట్టాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. టీటీడీకి ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. తిరుమలలో ప్లాస్టిక్ వాడరాదని, పర్యావరణ నిబంధనలు పాటించాలని అందరికీ చెబుతుంది. తాను ఎందుకు ఇవే నిబంధనలను పాటించలేకపోయింది. కేంద్రంతో ఎందుకు మొట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రకాల పర్యావరణ నిబంధనలను తోసిరాజని రుషికొండలో నిర్మాణాలు సాగిస్తోంది. దానిని టీటీడీ ఆదర్శంగా తీసుకొంటున్నట్లు అనిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గత ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయిస్తే అంత అవసరం లేదని దానిని కుదించి చిన్న ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. బయట రాష్ట్రాల్లో మాత్రం భారీ నిర్మాణాలకు పరుగులు తీయడం దురదృష్టకరం’’ అని విజయ్ కుమార్ విమర్శించారు.