ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యార్లగడ్డ వైసీపీని వీడటంపై ముందే నిర్ణయం తీసుకున్నారు,,,సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 06:21 PM

గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడటంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. యార్లగడ్డ పోతే పోనీ అని తాను అన్నట్లు వక్రీకరించారని, తాను కాదని, తమ పార్టీలో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని వ్యాఖ్యానించారు. యార్లగడ్డను ఎవరూ అవమానించలేదని, యార్లగడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందని తనలాంటి వాళ్లు చెప్పారని తెలిపారు. పోతే పోనీ అని తాను ఎందుకు అంటానని, యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు.


ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, పార్టీ నిర్ణయానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాలని సజ్జల సూచించారు. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇలాంటివి సహజమని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌పై సజ్జల విమర్శలు చేశారు. జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు ఉన్నాడని స్పష్టమవుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఎలా చెబితే పవన్ కళ్యాణ్ అలా చేస్తారని, చెప్పేది చంద్రబాబు, ఫాలో అయ్యేది పవన్ అని ఆరోపించారు. సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ ఎన్నోసార్లు చెప్పారని, దీని కోసం పవన్ ఎవరితోనైనా కలుస్తారని అన్నారు.


పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసే ఉన్నారని, సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని సజ్జల ఆరోపించారు. విశాఖకు రాజధాని రాకూడదనేదే పవన్, బాబు లక్ష్యమని, విశాఖ టూర్ పేరుతో నానా హంగామా చేస్తున్నారన్నారు. చంద్రబాబును మోయడమే పవన్ లక్ష్యమని, చంద్రబాబుకు అసలు విజన్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు.


'వెనుకబాటుతనాన్ని రూపుమాపాలని సీఎం జగన్ తపన పడుతున్నారు. కులం, మతం కారణంగా అసమానతలు ఉండొద్దు. అసమానతలు లేని పాలన నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్‌లో కన్పిస్తోంది. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణంలో నిరుపేదలకు ముంపు బెడద తప్పింది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా నాడు వైఎస్సార్ ప్రారంభిస్తే.. నేడు సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో కూడా అణగారిన వర్గాలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది నాడు వైఎస్సార్ అయితే .. నేడు సీఎం జగన్ మాత్రమే. 2014 నుంచి 2019 వరకు గిరిజనులకు, మైనార్టీలకు చంద్రబాబుకు అవకాశమివ్వలేదు. వైసీపీలో అధికారిక హోదాలో 50 శాతం మహిళలకు అవకాశం ఇచ్చాం. ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరు శాతం గిరిజనులకే అధికారం' అని సజ్జల తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa