ఏపీలో కాపు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 22న కాపు నేస్తం పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ మాధవీలత సమీక్ష చేశారు. నిడదవోలులో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్సార్ కాపునేస్తం 4వ విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని సీఎం బటన్ నొక్కి ప్రారంభిస్తారన్నా రు.ఈ మేరకు రూట్ మ్యాప్, సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్‌లో సభ, నెహ్రూబొమ్మ సెంటరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్‌కు స్థలాలను పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తోంది. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం మహిళలకు ఇస్తోంది. ఈసారి నాలుగో విడత డబ్బుల్ని విడుదల చేస్తున్నారు. కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000/- వేల లోపు ఆదాయం ఉండాలి. కాపు నేస్తానికి సంబంధించి కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి.. మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులు.
కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులు. అయితే ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్ వంటి వాహనాలను జీవనోపాధి కోసం ఉన్నవాళ్లు మాత్రం అర్హులు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పుటికీ ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అనర్హులు. ప్రభుత్వ పెన్టన్ పాందుతున్నవారు సైతం కాపు నేస్తానికి అనర్హులు. అంతేకాదు కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అనర్హులు. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, వయసు నిర్దారణ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి.
కాపు నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్‌లో పడగానే లబ్ధిదారుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఈ పథకం కింద లబ్ది పొందేందుకు అర్హత ఉన్నా సరే.. కొన్ని అనుకోని కారణాల వల్ల జాబితాలో పేర్లు లేని వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత అర్హులైన వారికి కూడా కచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది. ఒకవేళ అకౌంట్‌లో డబ్బులు పడకపోతే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.