సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలోనూ కొన్ని చోట్ల దళితుల పట్ల వివక్ష కొనసాగుతోంది. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితులకు ఆలయాల్లోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. తాము కూడా అందరిలాంటి మనుషులమేనని, దేవుడిని దర్శించుకొని కోరిక తమకి ఉంటుందని వారు మొర పెట్టుకున్నా కొందరు మాత్రం రాతియుగంలో ఉండిపోయారు. తాజాగా, తిరుపతి జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దళితులు ఆలయంలోకి రాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గొల్లపల్లి గ్రామంలోని పోలాక్షమ్మ జాతర సందర్భంగా శనివారం దళితులు పొంగళ్లు పెట్టేందుకు ఆలయానికి వెళ్లారు. ఆలయ పూజారి, గ్రామస్థుల దళితులకు ప్రవేశం లేదంటూ ఆలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో దళితులు అక్కడ నిరసన దిగారు. చివరకు అమ్మవారికి బయటే పొంగళ్లు నివేదించి, మొక్కులు చెల్లించుకుని నిరాశతో వెనుదిరిగారు. ఈ ఘటనపై దళితపోరాట హక్కుల సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు మాసాలుగా పోరాటం చేస్తున్నామని, తాము గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అయినా ఫలితం లేకపోయిందని మండిపడింది.
దళిత హక్కుల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పోలాక్షమ్మ ఆలయంలోకి దళితులకు ప్రవేశం కల్పించాలని మూడు నెలల నుంచి తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్‌ను పంపి ప్రవేశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, గ్రామస్థులు మాత్రం ఆలయంలోకి ప్రవేశించకుండా తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. అనంతరం ఆలయం బయటే అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.