ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నందువల్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఏపీలోని అన్ని జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, గుంటూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
మరో వైపు తెలంగాణకు వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, , కరీంగర్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.