గత కొంత కాలంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఊపు మీద ఉండగా.. ఏపీలో కొంచెం స్తబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో భూముల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ, టీడీపీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భూముల రేట్లు పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. కోకాపేటలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరా కోటికిపైగా పలికింది. దీని ప్రభావంతో భాగ్యనగరంలో భూముల ధరలు, ఇండ్లు, అపార్ట్‌మెంట్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ శివార్లలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు భూములు కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తింది.
ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. హైదరాబాద్ తరహాలో భారీ భూమ్ అక్కడ కనిపించడం లేదు. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటైన ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగాయి. 2014లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రాలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రాజధాని ప్రకటన తర్వాత.. అమరావతి ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. 2019లో జగన్ అధికారంలోకి రావడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గింది. ఇక మూడు రాజధానుల ప్రకటన చేశాక.. అమరావతిలో భూముల రేట్లు భారీగా పడిపోయాయి. జగన్ సర్కారు రాజధానిని విశాఖపట్నానికి మారుస్తుందనే ప్రచారంతో వైజాగ్‌లో మాత్రం భూముల ధరలు పెరిగాయి. మిగతా ప్రాంతాల్లో అంతకు ముందుతో పోలిస్తే భూముల ధరల పెరుగుదల నెమ్మదించింది.
2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా భూముల ధరలు పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అంతకు ముందు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం దీనిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణలో మరోసారి కేసీఆర్ సర్కారు అధికారంలోకి వస్తే.. హైదరాబాద్‌లో రియట్ భూమ్ మరింత పెరగనుంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొంత స్లో అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఏపీలో భూముల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే సుస్థిర ప్రభుత్వం పేరిట భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అమరావతిలో భూముల ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ సర్కారే కొలువు దీరినప్పటికీ.. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అమరావతి పరిధిలో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రం.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఇక్కడ కొనుగోలు చేయలేని వారు ఆంధ్రావైపు చూస్తున్నారు. ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. విశాఖ ప్రాంతంలో భూములు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుండగా.. చంద్రబాబు గెలిస్తే అమరావతి ఏరియాలో మళ్లీ రియల్ భూమ్ వచ్చే ఛాన్సు ఉంది.