ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్అకాడమీ ఇటీవల చేసిన ఓ పని తీవ్ర వివాదాస్పదంగా మారి విమర్శలకు తావిచ్చింది. టీచింగ్‌లో భాగంగా చదువుకున్న వారికే ఓటు వేయాలని ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు సూచించారు. అయితే ఈ ఘటనపై సదరు అన్అకాడమీ సంస్థ తీవ్రంగా స్పందించింది. అయితే ఈ తొలగింపుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొంత మంది టీచర్ నిజమే చెప్పాడని మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఎన్నికల్లో పోటీకి, చదువుకు సంబంధం లేదంటూ వాద ప్రతివాదాలకు దిగుతున్నారు. అయితే ఈ ఘటనపై వేటు పడిన టీచర్ కరణ్ సంగ్వాన్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ , మీమ్స్ వస్తాయని భయపడి అన్‌అకాడమీ సంస్థ తనను ఉద్యోగంలో నుంచి తొలగించిందని ఆరోపించారు.
చదువుకున్న వారికే ఓటువేయాలని విద్యార్థులకు చెప్పిన ఉపాధ్యాయుడిపై ఇటీవల ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్‌అకాడమీ వేటు వేసింది. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైంది కాదంటూ ఆయన్ను తొలగించడానికి గల కారణాన్ని వివరించింది. దీనిపై ఉపాధ్యాయుడు కరణ్ సంగ్వాన్ శనివారం స్పందించారు. తాను చేసిన సాధారణ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకుని సంస్థ తనను తొలగించిందన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకే అన్‌అకాడమీ తనను తొలగించిందని ఆరోపించారు.
తొలగింపుపై స్పందించిన కరణ్ సంగ్వాన్.. తాను సాధారణంగా చేసిన ఓ వ్యాఖ్యను తప్పుగా భావించి తనను తొలగించారని పేర్కొన్నారు. అయితే తనను ఉద్యోగం నుంచి తీసేసే ముందు ఒక్కసారి కూడా తనతో అన్అకాడమీ సంస్థ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నుంచి ఎలాంటి వివరణ కూడా తీసుకోలేదని చెప్పారు. సోషల్ మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అన్అకాడమీ సంస్థ తట్టుకోలేకపోయిందని.. అందుకే తన ఉద్యోగం తీసేయాల్సి వచ్చిందేమో అని వివరించారు. అదే సమయంలో అన్‌అకాడమీ సంస్థ ఉద్దేశాలను తాను ఎలా చెప్పగలనని సంస్థను ప్రశ్నించారు. తన ఉద్యోగాన్ని తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ లెటర్‌ను తనకే డైరెక్ట్‌గా పంపవచ్చని కరణ్ సంగ్వాన్ తెలిపారు. సంస్థపై వచ్చే ఒత్తిడి చెప్పకుండా.. నియమాలను ఉల్లంఘించారని అన్అకాడమీ ఆరోపించిందని పేర్కొన్ని కరణ్ సంగ్వాన్.. తాను ఎవరి పేరు ప్రస్తావించకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో తాను ఆ వ్యాఖ్య చేసినట్లు తెలిపారు. అంతేకానీ తరగతి గదిలో చేయలేదని.. ఆ విషయాన్ని అన్అకాడమీ సంస్థ ప్రస్తావించ లేదని సంగ్వాన్ వెల్లడించారు.
చదువుకున్న వారికే ఓటు వేయాలని తాను చేసిన సాధారణ వ్యాఖ్యపై తనకు బెదిరింపులు కూడా వచ్చాయని సంగ్వాన్ పేర్కొన్నారు. తనను దేశ వ్యతిరేకి అని.. చంపేస్తా అని ఓ వ్యక్తి హెచ్చరించాడని తెలిపారు. అయితే ఈ కారణం మీద అన్అకాడమీ సంస్థ తనను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత లక్షలాది మంది నుంచి సపోర్ట్ వచ్చిందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా అన్‌అకాడమీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టినట్లు వివరించారు. బాగా చదువుకున్న రాజకీయ నాయకుడికి ఓటు వేయాలి అనడం పక్షపాతంతో కూడిన అభిప్రాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
అయితే ఈ ఘటనపై సదరు అన్అకాడమీ సంస్థ వివరణ ఇచ్చింది. విద్యార్థులకు మెరుగైన విద్యను ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. పక్షపాతం లేకుండా విద్య బోధన జరిగేందుకు తమ సంస్థలో పనిచేసే టీచర్లకు కఠిన నిబంధనలు రూపొందించిటన్లు చెప్పింది. తాము చేసే ఏ పని అయినా విద్యార్థులకు సంబంధించిందే ఉంటుందని.. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి తరగతి గది సరైన వేదిక కాదని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు విద్యార్థులను ప్రభావితం చేస్తాయని.. తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంగ్వాన్‌ను తొలగించాల్సి వచ్చిందని అన్‌అకాడమీ కో ఫౌండర్ రోమన్‌సైనీ ఇంతకు ముందే వెల్లడించారు.