కర్ణాటకలో ‘ఆపరేషన్ హస్తం’పై ఊహాగానాల నడుమ గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొంత మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి చేరుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్టీ సోమశేఖర్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఆదివారం భేటీ అయ్యారు. సీఎం సిద్ధూను కేవలం తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసమే కలిసినట్టు యశ్వంతపూర్ ఎమ్మెల్యే సోమశేఖర్ వెల్లడించారు. సిద్ధరామయ్యతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య లేఅవుట్‌లో మెటర్నిటీ హాస్పిటల్, కెంగేరీ శాటిలైట్ టౌన్‌లో ఫ్లైఓవర్ పనులు గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్టు పేర్కొన్నారు.
ఇదే సమయంలో జేడీఎస్ నేత అయనూర్ మంజునాథ్‌తో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తనతో మంజునాథ్ భేటీపై డీకే స్పందిస్తూ.. తనను ఎంతో మంది కలుస్తుంటారని, వాటి వెనుక కారణాలను వివరించలేనని అన్నారు. ‘ఆపరేషన్ హస్తం’తో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌గా పేర్కొంటున్నారు.
2019లో ‘ఆపరేషన్ కమలం’తో 17 మంది కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించగా.. దీనికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ హస్తం’ను కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్టు ప్రచారం సాగుతోంది. ఆపరేషన్ కమలంతో కర్ణాటకలో కాంగ్రెస్- జేడీ (ఎస్)ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో కమలనాథులు అప్రమత్తమయ్యారు. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నాలు ప్రారంభించింది.
రెండు రోజుల కిందట బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు శివరాం హెబ్బార్, మునిరత్నలతో మాట్లాడానని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. వారు పార్టీని వీడేది లేదని స్పష్టంగా చెప్పారని అన్నారు. స్థానిక సమస్యలను మా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లామని, వాటిని పరిష్కరించి ఐక్యంగా ఉంటామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ హస్తం’పై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తాట ఎలా తీయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సీటీ రవి వ్యాఖ్యలకు శివకుమార్ స్పందిస్తూ.. ‘తాట తీస్తానని బెదిరిస్తున్నారు. మీరు (బీజేపీ) కాంగ్రెస్, జేడి (ఎస్) ఎమ్మెల్యేలను తీసుకెళ్లినప్పుడు ఏమి జరిగింది? ఎదుటివారిపై బెదిరింపులకు పాల్పడినప్పుడు.. వారిని కూడా ఎలా బెదిరించాలో తెలుసు. మీరు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారు’ అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లోకి రావాలని తాను ఎవరినీ పిలవడం లేదని, ఇప్పుడు మా పార్టీలో ఎవరూ చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa