ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే. లోకేశ్ పాదయాత్రలో మొదలైన ఉద్రిక్తతలు, పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
ఈ కేసుల్లో 50 మందికి పైగా నిందితులుగా పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఇటీవలే టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1గా పేర్కొనడం గమనార్హం. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణ అనే వ్యక్తిని కూడా ఈ కేసుల్లో నిందితుడిగా పేర్కొన్నట్టు సమాచారం. ఇక, టీడీపీ మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలపైనా రంగన్నగూడెం ఘర్షణలకు సంబంధించి కేసు నమోదైంది.