రాష్ట్రాన్ని ఈ దోపిడీ దొంగలకు వదిలిపెడితే మన భవిష్యత్ అంధకారం అవుతుందని వైసీపీ ప్రభఉత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన మరోసారి ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల అంశంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్రాన్ని ఈ దోపిడీ దొంగలకు వదిలిపెడితే మన భవిష్యత్ అంధకారం అవుతుందని, రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ కర్రు కాల్చి వాత పెట్టినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఎన్జీటీ ఆదేశాలపై వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని సార్లు చిన్న కామెంట్ వల్ల ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయని, ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ వల్ల, రైలు ప్రమాదం వల్ల కూడా మంత్రులు రాజీనామా చేసిన దృష్టాంతాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. నైతిక బాధ్యతతో ఆ విధంగా చేశారని వెల్లడించారు.
"కానీ, ఇసుక తవ్వకాల విషయంలో ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని ఆదేశాలు వస్తే, ఇన్నిసార్లు తప్పుబడితే మీకు బుద్ధి, జ్ఞానం లేదా? అతడికి బుద్ధి, జ్ఞానం లేకపోతే రాష్ట్రంలో ఉన్న మన ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు. వీటికి తప్పనిసరిగా జవాబులు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
1. ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక తవ్వింది ఎంత... ప్రభుత్వ ఆదాయం ఎంత?
2. జీఎస్టీ ఎంత చెల్లించారు... ఏ సంస్థ పేరున చెల్లించారు?
3. రాష్ట్రంలో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాలు ఎన్ని... వాటిల్లో ఉన్న నిల్వలు ఎంత?
4. పర్యావరణ అనుమతులు ఉన్న ఇసుక రీచ్ లు ఎన్ని? ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది?
5. ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి ఎస్ఈఐఏఏ ఈసీలను రద్దు చేయడం నిజం కాదా?
6. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే ఇచ్చేందుకు నిరాకరించలేదా?
7. ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయడంలేదని వేసిన ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లో ప్రభుత్వాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది వాస్తవం కాదా?
8. కమీషన్ రూపంలో ప్రతి నెలా రూ.35 కోట్లు చెల్లించలేక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజ్ ఆత్మహత్య నిజం కాదా?
9. ఒప్పందాలు లేకపోయినా రాష్ట్రంలో నేడు ఇసుక తవ్వకాలు చేస్తుంది ఎవరు?
10. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దోపిడీపై 48 గంటల్లో సమాధానం చెప్పాలి.