దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిగా మంచి అభ్యర్థిని ఎంపికచేస్తానని అప్పటివరకు స్థానిక నాయకులంతా సమష్టిగా పనిచేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో ఆయన శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. తొలుత నాయకులతో ఎమ్మెల్యే రామానాయుడు, షరీఫ్ మాట్లాడారు. ఆ సందర్భంగా దర్శి నాయకులు ఇన్‌చార్జిగా ఎవరిని నియమించాలన్న అంశంపై మూడు నాలుగు పేర్లుని సూచించినట్లు తెలిసింది. మౌమిత ఫౌండేషన్ చైర్మన్ బాదం మాధవరెడ్డి పేర్లను ఎక్కువమంది సూచించినట్లు సమాచారం. అలాగే గతంలో కొంతకాలం ఇన్‌చార్జిగా పనిచేసిన పమిడి రమేష్ పేరు, హర్షిణీ కాలేజీ చైర్మన్ రవికుమార్ పేరుతోపాటు మరొకరి పేరుని కూడా కొందరు సూచించినట్లు తెలిసింది. సమావేశానికి హాజరైన వారు ఏకగ్రీవంగా ఒకపేరుని సూచించలేకపోయారు. ఆ తర్వాత అందరు నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుంది, ఓటర్ల సవరణల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గతంలో పమిడి రమేష్ ఆయనంతట ఆయనే వచ్చి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని అడిగి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయనే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎవరిని ఇన్‌చార్జిగా నియమించాలన్న అంశాన్ని పార్టీ సీరియస్‌గా పరిశీలన చేస్తోందని, సమర్థవంతమైన అభ్యర్థిని పంపిస్తామని అందరూ సమష్టిగా వారికి సహకరించాలని సూచించారు. ఎవరికి వారు కొందరిపై ఆసక్తులు పెంచుకోవద్దని అందరికీ ఉపయోగపడే అభ్యర్థిని పంపిస్తామన్నారు. అందరూ కలిసి ముందుకు సాగి పార్టీ విజయానికి కృషిచేయాలని ఉద్బోధించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బ్రహ్మంచౌదరి, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.