అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి క్రమేపీ మద్దతు పెరుగుతోంది. అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్న నేతల మధ్య తొలి బహిరంగ చర్చ వాడీవేడీగా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మొత్తం 8 మంది అభ్యర్థులు ఆ పార్టీలో పోటీ పడుతుండగా.. బుధవారం జరిగిన ప్రాథమిక బహిరంగ చర్చలో ఆరుగురు పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతి నేతలు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఉన్నారు.
అయితే, ఈ డిబేట్ తర్వాత వివేక్ పేరు మార్మోగుతోంది. దీంతో పాటు ఆయనకు అందే విరాళాల మొత్తంలోనూ భారీ పెరుగుదల నమోదైందని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నారు. మొదటి డిబేట్ తర్వాత వివేక్ రామస్వామికు పెరిగిన ప్రజాదరణ విరాళాల రూపంలో కనిపించింది. వివేక్ రామస్వామి ప్రచార బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్చ ముగిసిన గంటలోనే ఆయన 4.5 లక్షల డాలర్ల (మన కరెన్సీలో రూ.3.7 కోట్ల) ను విరాళాలుగా అందుకున్నారని తెలిపారు. సగటు విరాళం 38 డాలర్లని పేర్కొన్నారు. అభ్యర్ధిత్వం కోసం పోటీలో ముందున్న ట్రంప్ గైర్హాజరు కావడంతో రిపబ్లిన్ చర్చలో వివేక్ కీలకంగా నిలిచారని ఓ కథనం వెల్లడించింది.
డిబేట్ అనంతరం జరిగిన సర్వేలో 28 శాతం మంది వివేక్ రామస్వామి ప్రదర్శన చాలా బాగుందని చెప్పగా.. 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతుగా నిలిచారు. ఇక, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌కు 13 శాతం మంది, నిక్కీ హేలీకి 7 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు, గూగుల్‌లో ఎక్కువగా శోధించిన నేతల్లో వివేక్ ముందువరుసలో ఉండగా.. తర్వాతి స్థానంలో హేలీ ఉన్నారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. వివేక్ రామస్వామి అందరి దృష్టిని ఆకర్షించారని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది.
ప్రైమరీ డిబేట్ అనంతరం మీడియాతో వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ఎంతో ధీమాగా కనిపించారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వ రేసులో ట్రంప్), తాను మాత్రమే మిగులుతామని ఆయన జోస్యం చెప్పారు. అలాగే డిబేట్‌లో ట్రంప్‌ను కొనియాడారు. 21వ శతాబ్దంలో ఆయన బెస్ట్ ప్రెసిడెంట్ అని ప్రశంసించారు. ‘అంతులేని విశ్వాసం.. అవమానాలతో బయోటెక్ వ్యవస్థాపకుడు తన ప్రత్యర్థులను రిపబ్లికన్‌ల మొదటి డిబేట్‌లో ఆధిపత్యం చెలాయించాడు.. వాడిగా వచ్చాడు.. తన ప్రత్యర్థులపై విరుచుపడ్డారు.. చిరునవ్వులు చిందిస్తూ వేదికపై ఉన్న మరింత అనుభవజ్ఞులైన అభ్యర్థుల పట్ల అంతగా గౌరవం ప్రదర్శించలేదు’ అని ది న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక రాసింది.