ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటైనర్లలో పెట్టుబడి పేరుతో ,,,,లక్షల్లో డబ్బుల్ని పెట్టుబడి పెడితే సంస్థ మూతపడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2023, 07:37 PM

ఈజీ మనీ పేరుతో అమాయకుల్ని ముంచేసిందో సంస్థ. కంటైనర్లపై పెట్టుబడి పెడితే ప్రతి రోజూ ఆదాయం పొందొచ్చని నమ్మించింది. 'మరికొందర్ని చేరిస్తే.. మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు' అంటూ నమ్మించింది. వందలాది మందితో పెట్టుబడులు పెట్టించి ఇప్పుడు బోర్డు తిప్పేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ లాజిస్టిక్‌ సంస్థను పోలిన ఓ నకిలీ వెబ్‌సైట్ రూపొందించింది డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో బాధితులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షిప్‌లు, కంటైనర్ల ద్వారా సరకు రవాణా చేసే అంతర్జాతీయ సంస్థ పేరులో మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్ www.3yearsmaersk.comను కొందరు ప్రచారం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తమ కంపెనీ వేలాది కంటైనర్ల ద్వారా సరకును సరఫరా చేస్తుందని.. ఆ కంటైనర్లు కొనుగోలు చేయొచ్చని ప్రకటించిందన్నారు. పెట్టుబడి పెడితే మంచి ఆదాయం ఇస్తామని నమ్మించారని.. యూపీఐ ఐడీల ద్వారా పెట్టుబడులు తీసుకున్నారన్నారు. ప్రతి రోజూ ఆదాయం అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని చెప్పారన్నారు.


ప్రతి రోజూ ఆదాయం అకౌంట్‌లోకి వచ్చి పడుతుండటంతో తాము కూడా నిజమని నమ్మేశామన్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని.. అక్కడితో ఆగకుండా మరికొందరితో పెట్టుబడులు పెట్టించామన్నారు.. వారితో ఓ గ్రూప్‌ ప్రారంభించారని.. అందులో చాలామందికి రూ.లక్షల ఆదాయం కనిపిస్తుండడంతో నమ్మకం కలిగింది అన్నారు. డబ్బులు రావడంతో అందరం నిజమని నమ్మేశామని.. ఆ తర్వాత మరో ప్లాన్ అమలు చేశారని చెప్పుకొచ్చారు. కొంత మందిని చేర్పిస్తే రెట్టింపు ఆదాయం ఇస్తామని నిర్వాహకులు నమ్మించారని ఇలా చాలామంది తమ స్నేహితుల్ని, తెలిసినవాళ్లతో కూడా పెట్టుబడులు పెట్టించారన్నారు.


రూ.లక్షల్లో ఉన్న డబ్బుల్ని విత్ డ్రా చేసుకుందామనే సరికి వీరి బాగోతం బయటపడింది అన్నారు. డబ్బుల్ని విత్‌ డ్రా చేస్తుంటే రిజెక్ట్‌ అని వచ్చిందని.. అప్పుడు ఆ డబ్బులకు ట్యాక్స్ చెల్లించాలని.. అప్పుడే డబ్బులు వస్తాయని నమ్మలికారన్నారు. ఈ లోగా డబ్బులు కట్టిన వెబ్‌సైట్ మూతపడిందని చెప్పుకొచ్చారు. ఇలా ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది మోసపోయినట్లు తెలుస్తోంది. వందలాది బాధితులు రూ.లక్షల్లో నష్టపోగా.. ఒకరిని చూసి మరొకరు పెట్టుబడులు పెట్టారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.


ఈ నకిలీ వెబ్‌సైట్లో బెంగళూరుకు చెందినవారు కూడా పెట్టుబడులు పెట్టారట. వారు చెప్పడంతో కొండపల్లి ప్రాంతంలో పలువురు డబ్బుల్ని పెట్టుబడి పెట్టామంటున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించి బెంగుళూరులోని వైట్ఫీల్డ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అక్కడ కేసు నమోదైందని చెబుతున్నారు. ఇలా ఏపీలో కూడా చాలామంది మోసపోయారంటున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేసి, దీని గురించి ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో వెబ్‌సైట్ సింగ్‌పూర్‌లో రిజిస్టర్‌ అయినట్లు తేలింది.. ఆ వివరాలను ఇప్పుడు తొలగించారు. బాధితులు డబ్బులు చెల్లించిన యూపీఐ ఐడీలు, బ్యాంకు ఖాతాల ద్వారా ఆరా తీస్తున్నారు.


తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాంతంలో కూడా పలువురు మోసపోయినట్లు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ లింక్‌ యాప్‌ ద్వారా రూ.18 వేలు డిపాజిట్‌ చేస్తే కంపెనీ లాభాల నుంచి ఏడాది పాటు నెలకు రూ.475 జమ చేస్తామని చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. చాలామందికి రెండు నెలలు అలాగే చెల్లించారని.. నమ్మకం కుదరడంతో వేలాది మంది యాప్‌లో చేరారన్నారు. శుక్రవారం తాము మోసపోయినట్లు గుర్తించా వారు ఆ కంపెనీ పేరుతో ఉన్న ఓ కంటైనర్‌ను నిలిపివేశారు. తమకు సొమ్ము చెల్లించే వరకూ వదిలేది లేదంటూ నల్లజర్ల పోలీసులకు దానిని అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com