ఏపీలో చాలా రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. మూడు వారాల నుంచి స్తబ్ధుగా ఉండగా.. ప్రస్తుతం ఈ రుతుపవనాలు కోస్తాంధ్రపై మోస్తరుగా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేడు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ ప్రభావం కనిపించగా.. ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయి వాన పడుతోంది. కోస్తాలోని.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 35 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా పోలవరంలో 27.2, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో 26.4, పార్వతీపురం మన్యం జిల్లాలో 26.4, అనకాపల్లి చోడవరంలో 24.8, అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురంలో 23.4, పార్వతీపురం జిల్లా బాలాజీపేటలో 23.2, పార్వతీపురంలో 22.8, వీరఘట్టంలో 22.4 మిల్లీ మీటర్లు.. అలాగే రాయలసీమలోని తిరుపతి జిల్లా పాకాలలో 51.2 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 50, తిరుపతిలో 44.4, చిత్తూరులో 38.2, పలమనేరులో 34, నగరిలో 33.2, సూళ్లూరుపేటలో 31.8, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 29.2, శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో 28.2, హిందూపురంలో 22, అనంతపురంలో 20.4, అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు మన్యంలోని చింతపల్లి, జీకే వీధి మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. గెడ్డలు, వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిలిచిపోయాయి. చింతపల్లి మండలంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు కుండపోత వాన పడింది. జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం కనిపించింది. తెల్లవారుజామున గంటపాటు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం అనంతరం మళ్లీ భారీ వాన పడింది. గూడెంకొత్తవీధి మండలంలో ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు కుండపోతగా వర్షం కురిసింది. వాగులు, గెడ్డల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కొండల మీద నుంచి ఘాట్ రోడ్డులోకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. మూడు వారాల తర్వాత నైరుతిలో కదలిక వచ్చింది. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. తవణంపల్లె మండలంలో 64.2, సోమలలో 62.6, యాదమరిలో 62.6, వి.కోటలో 50, సదుంలో 49.4, పూతలపట్టులో 47.4, గంగాధరనెల్లూరులో 43, గుడిపాలలో 42, శ్రీరంగరాజపురంలో 40.8, చిత్తూరులో 38.2, నిండ్రలో 37.2, చౌడేపల్లెలో 36.4, రొంపిచెర్లలో 34.2, పలమనేరులో 34, నగరిలో 33.2, పులిచెర్లలో 30.4, విజయపురంలో 30.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.