ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారే కారణమంటూ బాంబు పేల్చారు. ఆయన ఏపీలో ఇప్పటికీ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. అప్పట్లో రాష్ట్ర విభజన అంశాలను తనతో పాటూ మరో అధికారి పరిష్కరించాల్సి వచ్చింది అన్నారు. విభజన నాటికి అన్ని అంశాలకూ పరిష్కారాలు కనుక్కోవాలని తాము రోజుకు 20 గంటలు పనిచేశామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అప్పట్లోనే వచ్చేయాల్సింది.. కానీ రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పుకొచ్చారు. 2014 ఫిబ్రవరి 20న హోదాపై మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారని.. మార్చి 1 న కేబినెట్ ఆమోదించిందని.. అదే రోజున ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. మార్చి 5న రాష్ట్ర అపాయింటెడ్ డేట్‌గా.. జూన్ 2న ప్రకటించారన్నారు. అదేరోజు ప్రత్యేక హోదాకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ ప్రణాళికా సంఘాన్ని కోరిందన్నారు. దానిపై ప్లానింగ్ కమిషన్‌తో తాను ఐదు సమావేశాలు పెట్టించినట్లు వివరించారు.
అదే సమయంలో ఎన్నికలు ఉండటంతో.. ఆ అంశాన్ని పట్టించుకునే వారు లేక తానే ప్రణాళికా సంఘం కార్యదర్శిని చాలాసార్లు కలిసి హోదా అంశాన్ని పూర్తి చేయాలని కోరినట్లు వివరించారు. తాను ఐదు మీటింగ్స్ పెట్టిస్తే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రతినిధి రాలేదని వివరించారు. ఆ ఐఏఎస్ అధికారి ఈ రోజు కీలక పదవిలో ఉన్నారన్నారు. ఆయన ఒక్క సమావేశానికి వచ్చి ఉంటే హోదా వచ్చేది అన్నారు. 2014 ఎన్నికల ఫలితాల వస్తాయని భావించి తాను మే 15న ప్రత్యేక హోదాకు సంబంధించిన చివరి మీటింగ్ పెట్టించాను అన్నారు.
అయితే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వస్తే.. తనవైపు నుంచి ఏ అభ్యంతరం లేదని ఈ రోు హోదా నోటిఫికేషన్ ఇచ్చేద్దామని ప్రణాళికా సంఘం కార్యదర్శి కూడా చెప్పారన్నారు. ఆ కీలకమైన మీటింగ్‌కు ఆ పెద్దమనిషి రాలేదని.. ఆర్థిక శాఖ నుంచి ఎవరినైనా పంపినా సరిపోయేది అన్నారు. అదీ చేయలేదని.. దీంతో ఏపీకి హోదా రాకుండా పోయింది అన్నారు. అలాగే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నానని గుర్తు చఏశారు. తాను పూర్తిగా రాష్ట్ర విభజన అంశాలపై పని చేశానని.. 2014 మే 22 నుంచి 2016 డిసెంబరు వరకూ సర్వీసులో ఉన్న కాలంలో ఏపీకి సంబంధించిన అన్ని విషయాల్లో తాను ఉన్నానన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని.. ఆయన ఆలోచనల్లో తాము కూడా పాలుపంచుకున్నామన్నారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని అనేక సంస్థలను తీసుకొచ్చామని.. 13 జాతీయ సంస్థలను రాష్ట్రానికి తెచ్చామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా తనను బాగా చూసుకున్నారని.. రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదన్నారు. ఇన్నేళ్లు ప్రభుత్వంలో పనిచేసినా మార్పునకు ఏమీ దోహదం చేయలేకపోతున్నానని తనకు అనిపించిందన్నారు. తాను ఆదిలాబాద్‌లో సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ మంత్రి తనపై నోరు పారేసుకుని చేయి కూడా ఎత్తారని.. అప్పుడు నాటి సీఎం ఎన్టీఆర్ తనను పిలిపించి 'బ్రదర్.. అయాం విత్ యూ.. బాగా పనిచేస్తున్నారు. ఇంకా బాగా పనిచేయండి' అంటూ ప్రోత్సహించారన్నారు.
సాధారణ కుటుంబంలో పుట్టి అలంపూర్‌లో పెరిగానన్నారు పీవీ రమేష్. తన తల్లి ప్రైవేట్ టీచర్.. తండ్రి సెంట్రల్ ఎక్సైజ్‌లో చిరుద్యోగి అని తెలిపారు. తన తండ్రి బదిలీ కావడంతో విజయవాడ వెళ్లామని.. అక్కడే విద్యాభ్యాసం జరిగిందన్నారు. 16 ఏళ్లకే వెల్లూరు మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరిలో సీటు వచ్చిందని.. కష్టపడి చదివి ఎంబీబీఎస్ తర్వాత ఆలోచించి సమాజానికి సేవ చేయాలన్న తపనతో ఐఏఎస్ చదివానన్నారు. సివిల్స్ రాసి ఆలిండియాలో 33వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు.