పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్‌శాఖ ఏఈ లంచం వ్యవహారం బయటపడింది. విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన అధికారి.. ఆ డబ్బుల్ని తీసుకునే సమయంలో ఏసీబీ ఎంట్రీతో పారిపోయాడు. ములక్కాయవలసకు చెందిన రైతు ఈశ్వరరావు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని విద్యుత్తు ఏఈ శాంతారావును కోరారు. ఈ మేరకు కోసం దరఖాస్తు పేరుతో ఫోన్‌పే ద్వారా రూ.4 వేలు ఆయన సూచించినట్లుగానే ట్రాన్‌ఫర్ చేశారు.
ఆ తర్వాత కనెక్షన్ ఇవ్వాలంటే రూ.60 వేలు లంచం ఇవ్వాలని ఏఈ శాంతారావు డిమాండు చేశారు. అయితే ఇప్పటికే రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకోగా.. మిగిలిన డబ్బుల కోసం రైతును డిమాండ్ చేశారు. దీంతో రైతు ఈశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అయితే విద్యుత్తు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానని రైతు చెప్పడంతో.. ఆదివారం సాయంత్రం మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తానని రైతు ఏఈకి చెప్పారు.
శాంతారావు ఆదివారం రాత్రి పొలం దగ్గరకు వచ్చి కారులో కూర్చుని ఈశ్వరరావును పిలిచారు. కారులోకి రమ్మని రూ.40 వేలు తీసుకున్నారు.. ఏసీబీ అధికారులు అక్కడే నిఘా పెట్టారు.. డీఎస్పీ, సీఐలు బైక్‌పై కారు దగ్గరకు వచ్చారు. ఏఈ అధికారుల్ని గమనించి కారును పక్కనే పొలాల్లోకి తిప్పారు.. గట్ల పైనుంచి కారు ఎగురుతూ వెళ్లింది. ఏఈని పట్టుకునేందుకు బైకుపై సీఐ కొంతదూరం ఛేజ్ చేశారు. ఏఈ కారుతో బైక్‌ను ఢీకొట్టడంతో సీఐ కిందపడి గాయాలు అయ్యాయి. అయితే శాంతారావు కొంత దూరం వెళ్లి లంచం డబ్బులు విసిరేసి.. కారు వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఏఈ శాంతారావు లంచం తీసుకుని తప్పించుకుపోవడమే కాకుండా పట్టుకునేందుకు యత్నించిన సీఐ బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ఏఈపై తీవ్ర చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ హెచ్చరించారు. ఆయన విద్యుత్తు శాఖ ఎస్‌ఈతో మాట్లాడారు.. శాంతారావు స్వచ్ఛందంగా లొంగిపోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఈ విషయం తెలియడంతో ఏడీఈ శంకరరావు మక్కువలోని కార్యాలయానికి చేరుకుని ఏసీబీ అధికారులకు వివరాలు అందించారు. శాంతారావుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. డిజిటల్ ఎవిడెన్స్‌తో పాటు రైతు ఫిర్యాదు అందడంతో దాడులు నిర్వహించామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.ఏఈ శాంతారావు సరెండర్ కావాలని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన పరారీలోనే ఉన్నారు.