జైలు పేరు చెబితే కరుడుగట్టిన నేరస్థులు ఉంటారనేది ఒకప్పటి మాట.. కానీ రోజులు మారాయి. ఆవేశంలో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఎంతోమందిలో సత్ప్రవర్తన తీసుకొచ్చిన ఘటనలు చాలానే చూశాం. అలాగే కొందరు ఖైదీలు జైల్లో ఉండి చదువకుంటూ డిగ్రీ, పీజీ పట్టాలు అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో ఖైదీ చదువుల్లో రాణిస్తూ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరుకు చెందిన శ్రీకాంత్‌గౌడ్ 20 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో కడప సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ శిక్ష అనుభవిస్తున్న సమయంలో అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత కడప సెంట్రల్ జైల్లో ఉంటూ ఎంఏ సోషియాలజీ చదివాడు.
ఈ క్రమంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాలుగు నెలల క్రితం రాష్ట్రంలోని అన్ని జైళ్లలోని ఖైదీలకు ‘డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విత్ మై లైఫ్’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది ఖైదీలు పాల్గొగా.. శ్రీకాంత్ గౌడ్ రాసిన వ్యాసానికి ప్రత్యేక కేటగిరిలో మొదటి బహుమతి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ సీతారామారావు చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపిక అందజేశారు. ప్రస్తుతం శ్రీకాంత్‌గౌడ్ నెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నానని.. విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు.