భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జాబిల్లిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంలోని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ స్వామీజీ చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించి, చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశం శివశక్తి పాయింట్ రాజధానిని చేయాలని విచిత్రమైన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును చాటుకునే లోపే జాబిల్లిని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వామీ చక్రపాణి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు ప్రధాని నరేందర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రుడ్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించిన అనంతరం ఈ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని కూడా పేర్కొన్నారు. ‘చంద్రుడ్ని హిందూ సనాతన దేశంగా ప్రకటించాలి.. ల్యాండింగ్ ప్రాంతం ‘శివశక్తి పాయింట్’ను రాజధానిగా అభివృద్ధి చేయాలి.. తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోలేడు’ అని ఆయన పేర్కొన్నారు.
అయితే, స్వామి చక్రపాణి మహరాజ్ ఇటువంటి వింత వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం కొత్తేం కాదు. గతంలో కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయంలో ఆయన ఢిల్లీలో ‘గోమూత్ర పార్టీ’ నిర్వహించి సంచలనం సృష్టించారు. కరోనాను తరిమికొట్టడానికి గోమూత్రం తాగాలంటూ హిందూ మహాసభ సభ్యులు ప్రచారం చేశారు. ‘జంతువులను చంపి తినే వ్యక్తుల కారణంగానే కరోనా వైరస్ వచ్చింది.. మీరు ఒక జంతువును చంపినప్పుడు అది ఆ ప్రదేశంలో విధ్వంసం కలిగించే ఒక విధమైన శక్తిని సృష్టిస్తుంది.. ప్రపంచ నాయకులు భారతదేశం నుంచి గోమూత్రాన్ని దిగుమతి చేసుకోవాలి ఎందుకంటే సర్వశక్తిమంతుడైన భగవంతుడు భారతీయ ఆవులో మాత్రమే ఉంటాడని, ఏ విదేశీ జాతిలోనూ కాదు’ అని స్వామీజీ చెప్పిన మాటలు అప్పట్లో సంచలనంగా మారాయి.
అంతకు ముందు 2018 నాటి కేరళ వరదలపై కూడా ఆయన వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేరళలో బీఫ్ తినే వారికి ఎలాంటి సహాయం అందకూడదని మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటన చేశారు. అలాగే, ఈ ఏడాది ఆరంభంలో హిందూ మతాన్ని అవమానించేలా ఉన్న బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు మొదలైనవాటిలో కంటెంట్‌ను పర్యవేక్షించడానికి ‘ధర్మ సెన్సార్ బోర్డు’ని ఏర్పాటు చేశారు.