ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కువ మంది జీవించేవారు. పట్టణాలు, నగరాల కంటే మన దేశంలో ఊరి జనాభానే ఎక్కువగా ఉండేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం గ్రామస్థులు పల్లెలు వదిలి పట్నాల బాట పడుతున్నారు. మొదట పిల్లలు వస్తుండగా.. తర్వాత వారి తల్లిదండ్రులు, వృద్ధులకు కూడా పట్టణాలు, నగరాలకే తీసుకెళ్తున్నారు. ఫలితంగా గ్రామాలు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అయినప్పటికీ ఒక కుటుంబం మాత్రం ఇప్పటికీ ఆ ఊరిలోనే నివసిస్తోంది. ఎంత మంది ఆ ఊరును వదిలిపెట్టి వెళ్లినా వారు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఇది అస్సాంలోని నల్‌బరి జిల్లాలో ఉన్న బర్ధ్‌నారా గ్రామం.
ఒకప్పుడు బర్ధ్‌నారా గ్రామంలో ఊరి నిండా జనం ఉండేవారు. కానీ ప్రస్తుతం ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అయితే ఆ గ్రామస్థులు ఊరిని విడిచి పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ పంటలు సరిగా పండక.. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామాన్ని వదిలి వెళ్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బర్ధ్‌నారా గ్రామంలో 16 మంది నివసించేవారు. ప్రస్తుతం బీమ్లా దేకా అనే వ్యక్తి కుటుంబం మాత్రమే అక్కడ ఉంటున్నారు. బీమ్లా దేకా భార్య అనిమాతోపాటు నరేన్, దీపాలి, స్యూటీ అనే ముగ్గురు పిల్లలు బర్ధ్‌నారాలో జీవిస్తున్నారు. నల్‌బరి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్ద్‌నారాలో కనీసం రోడ్డు సౌకర్యం లేదు. కరెంటు లేక వారు చీకట్లోనే బతుకుతున్నారు. రోడ్డు సదుపాయం కూడా లేదని.. ఇక వర్షాకాలంలో పడవ సాయంతోనే ఊరు దాటాల్సిందేనని ఉంటుందని బీమ్లా చెప్పాడు.
అయితే కొన్ని దశాబ్దాల క్రితం బర్ధ్‌నారాకు అప్పటి సీఎం బిష్ణురామ్ మేధి.. రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. అయితే వర్షాలు, వరదల కారణంగా ఆ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. తర్వాత దానికి మరమ్మతులు గానీ కొత్త రోడ్డు గానీ వేయకపోవడంతో బర్ద్‌నారా గ్రామం నుంచి ఒక్కక్కరుగా అందరూ వలస వెళ్లిపోయారు. తమ గ్రామ పరిస్థితి గురించి కలెక్టర్ ఆఫీస్‌లో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నాడు. వేరే ఊరికి వెళ్లాలంటే 2 కిలోమీటర్లు నీళ్లు, బురదతో ఉన్న రోడ్డులోనే వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేక కిరోసిన్ దీపాల కిందే తన పిల్లలు చదువుకుంటున్నట్లు తెలిపాడు. వ్యవసాయం, పశువుల పోషణతోనే బతుకు వెళ్లదీస్తున్నట్లు పేర్కొన్నాడు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ గ్రామం ఇలా తయారైందని అనిమా ఆవేదన వ్యక్తం చేసింది.
బర్ధ్‌నారా పరిస్థితి తెలుసుకున్న గ్రామ్య వికాస్ మంచా అనే ఎన్‌జీవో సంస్థ చర్యలు చేపట్టింది. అక్కడి భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తోంది. ఈ కారణంగా వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి వచ్చి వ్యవసాయం చేసి బతుకుతాయని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని.. రోడ్డు, కరెంటు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని ఎన్‌జీవో అభిప్రాయపడింది.