కంటే కూతుర్నే కను.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1998లో విడుదలైన ఈ సినిమా తెలుగు వాళ్లందర్నీ కంటతడి పెట్టించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కొడుకు పట్టించుకోకపోతే.. ఆడపిల్లే దిక్కవుతుందని.. అందుకే ఆడ పిల్ల పుట్టుకను తక్కువ చేసి చూడొద్దనే సందేశాన్ని ఈ సినిమా ఇచ్చింది. ఆ సినిమా సంగతి అటుంచితే.. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఆడపిల్లలకే ఎక్కువ ఉంటాయనేది కాదనలేని వాస్తవం. పుట్టింట్లో ఎవరికైనా ఏమైనా అయితే మెట్టినింట ఆడపిల్ల మనసు విలవిల్లాడుతుంది. ఇక తండ్రికి ఏదైనా జరగరానిది జరిగితే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పుట్టింట్లో వాలిపోతుంది. అయితే కాలం మారింది. ఆడ పిల్లల్లోనూ కఠినాత్ములు ఉంటున్నారు. ఎంతలా అంటే మీ నాన్న చనిపోడమ్మా అని ఫోన్ చేసి చెబితే.. కడసారి చూసేందుకు కూడా వచ్చేందుకు ఇష్టపడనంతగా. శవాన్ని తగలబెడతారో.. పడేస్తారో.. మీ ఇష్టం అని తనకు ఫోన్ చేసిన పోలీసులతో చెప్పేంతగా.. చదువుతుంటూనే అయ్యో పాపం అనిపిస్తుంది కదా.. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రకు చెందిన మూల్‌చంద్ర శర్మ (72) రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఆయనకు ఇద్దరు పిల్లలు.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కొడుకు దక్షిణ ఆఫ్రికాలో స్థిరపడగా.. కూతురు కెనడాలో ఉంటోంది. అందరు తండ్రుల్లాగే ఆయన తన పిల్లలకు మంచి చదువు చెప్పించారు. వారు ఉన్నత స్థితికి చేరుకునేందుకు తన శాయశక్తులా కృషి చేశారు. వృద్ధాప్యంలో ఉన్న మూల్‌చంద్రకు స్ట్రోక్ కారణంగా పక్షవాతం వచ్చింది. దీంతో ఓ వ్యక్తిని మాట్లాడుకొని.. చికిత్స నిమిత్తం కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో ఉన్న నగరమునవల్లికి మూల్‌చంద్రను తీసుకెళ్లారు. చికిత్స అనంతరం అక్కడే ఓ లాడ్జిలో ఆయన్ను ఉంచారు. మూల్‌చంద్రతోపాటు వచ్చిన వ్యక్తి కాంట్రాక్ట్ ముగియడంతో.. అతడు ఆయన్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. మూల్‌చంద్ర అస్వస్థతకు గురి కావడంతో లాడ్జి యాజమాన్యం, స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారొచ్చి ఆయన్ను బెల్గాం జిల్లా హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. చనిపోయే ముందు మూల్‌చంద్ర.. తన కొడుకు, కూతురి ఫోన్ నంబర్లను పోలీసులకు ఇచ్చారు.
దీంతో పోలీసులు వారిని సంప్రదించడానికి ప్రయత్నించారు. చాలా సేపు ప్రయత్నించిన తర్వాత మూల్‌చంద్ర కూతుర్ని వాట్సాప్‌లో కాంటాక్ట్ చేయగలిగారు. మీ నాన్న గారు చనిపోయారు అని పోలీసులు చెప్పగా.. ఆమె చాలా దురుసుగా బదులిచ్చారు. తన తండ్రితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె కఠినంగా మాట్లాడింది. ఆయన అంత్యక్రియలతో తనకు సంబంధం లేదని తెగేసి చెప్పింది. తగలబెడతారో.. పారేస్తారో మీ ఇష్టం అంటూ.. ఆమె నోట కటువుగా వచ్చిన మాటలు విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు. దీంతో చేసేందేం లేక మూల్‌చంద్ర మృతదేహానికి పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఓ కూతురు తండ్రి శవాన్ని ఈడ్చి పడేయండంటూ మాట్లాడిన తీరు పోలీసులను తీవ్రంగా బాధించింది. ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారా..? అని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఆ తండ్రి ఆమెకు ఏదైనా అన్యాయం చేసినా.. ఇలా మాట్లాడం మాత్రం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa