ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ,,,,గురువారం పూర్తి వివరాలు సమర్పిస్తామని వెల్లడి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 08:02 PM

ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఈ సందర్బంగా జమ్మూ కశ్మీర్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదాపై కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంత హోదా  శాశ్వతం కాదని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆగస్టు 31న ధర్మాసనం ముందు ఉంచుతామని వెల్లడించింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా? అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అడిగిన ప్రశ్నకు కేంద్రం పై విధంగా స్పందించింది.


ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకమన్న ధర్మాసనం.. ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనికి బదులిస్తూ.. ‘జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు.. లడఖ్‌కు సంబంధించినంత వరకు కేంద్రపాలిత ప్రాంత హోదా మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది’ అని తెలియజేశారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఆగస్టు 31న తెలియజేస్తామని అన్నారు. దీనికి అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లను ఉదాహరణగా చూపారు.


దీనిపై రాజ్యాంగ ధర్మాసనం స్పందిస్తూ.. ‘జాతీయ భద్రత అంశం దృష్ట్యా రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ముఖ్యం.. సరైన కాలపరిమితితో ప్రస్తుత పరిస్థితికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.. ఎప్పటిలోగా వాస్తవిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో మాకు తెలియజేయాలి’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటో తెలియజేయాలని ఎస్జీ తుషార్‌ మెహతాతోపాటు అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిలకు సుప్రీం ధర్మాసనం సూచించింది.


కాగా, జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత రాష్ట్ర హోదా పునరుద్దరిస్తామని కేంద్రం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాజాగా కోర్టుకు తెలిపారు. ‘పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక రాష్ట్ర హోదా పునరుద్దరణపై పార్లమెంటు వేదికపై ఒక ప్రకటన చేశారు.. ... ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఎస్జీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa