టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో లక్కవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ పాలనలో గ్రామాల్లోని చెరువులను వేలం వేయకుండా మత్స్యకార సంఘాలకు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం బహిరంగ వేలంతో తమకు చెరువులు ఇవ్వకుండా అధికారపార్టీకి చెందిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై నిలదీశామనే కక్షతో స్థానిక ఎమ్మెల్యే తాము మత్స్యకారులం కాదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని మత్స్యకారులు వాపోయారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ... మత్స్యకారుల జీవనోపాధికి ఉపయోగపడే చెరువులను కూడా జగన్ వైసీపీ దొంగలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. జగన్ తమ పార్టీ వారికే చెరువులు ఇవ్వాలనే చేయడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలివేటుగా ఉన్న జీఓ 217ను రద్దు చేస్తామని తెలిపారు. గతంలో మాదిరి మత్స్యకార సొసైటీలకే చేపల చెరువులను కేటాయిస్తామన్నారు. వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి చంద్రన్నబీమాలో పరిహారం అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.