మహిళ మెదడులో సజీవంగా ఉన్న ఏలిక పామును వైద్యులు వెలికితీశారు. వైద్య చరిత్రలోనే మొదటిసారి పరాన్న జీవిని మనిషి మెదడులో గుర్తించిన అరుదైన ఘటన ఆస్ట్రేలియాలో లో వెలుగుచూసింది. న్యూసౌత్ వేల్స్‌కు చెందిన ఓ 64 ఏళ్ల మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పొడవున్న ఏలిక పామును గుర్తించారు. సాధారణంగా ఈ పరాన్న జీవి ‘కార్పెట్ కొండచిలువ’ల్లో కనిపిస్తుంది. కానీ, ప్రపంచంలోనే మనిషికి సోకడం ఇదే మొదటిసారని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. జంతువుల నుంచి మనుషులకు పొంచి ఉన్న వ్యాధుల ముప్పును ఇది మరోసారి గుర్తుచేస్తోందని హెచ్చరించారు.
న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన బాధిత మహిళ 2021 జనవరిలో అనారోగ్యం బారినపడ్డారు. కడుపు నొప్పి, దగ్గు, రాత్రుళ్లు చెమటలు పట్టడం, డిప్రెషన్ వంటి లక్షణాలతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. అయితే, పరిస్థితి మెరుగుపడకపోగా.. 2022 నాటికి మరింత దిగజారింది. మతిమరుపు మొదలు కావడంతో కాన్‌బెర్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెదడులో తీవ్ర సమస్య ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే గతేడాది జూన్‌లో ఆమెకు సర్జరీ నిర్వహించిన వైద్యులకు సజీవంగా ఉన్న ఏలిక పాము కనిపించింది.
ఊహించని పరిణామంతో తామంతా ఖంగుతిన్నామని న్యూరో సర్జన్ డాక్టర్ బండి హరిప్రియ తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో న్యూరోసర్జన్ మెలితిరిగిన పురుగును కనుగొన్నారని, మెదడులో పరాన్నజీవి ఉంటుందని ఊహించలేదని కాన్‌బెర్రా ఆస్పత్రి ఇన్‌ఫక్టియస్ డీసీజెస్ ఫిజీషియన్ డాక్టర్ సంజయ సేనానాయకే అన్నారు. ఆ పరాన్న జీవిని ల్యాబ్‌లో పరీక్షించగా.. ‘కార్పెట్ కొండచిలువ’ల్లో కనిపించే ‘ఓఫిడాస్కారిస్ రాబర్ట్సీ’ ఏలిక పాముగా తేలిందని, వైద్య చరిత్రలోనే ఇది అరుదైన కేసని అన్నారు. ఇది మూడో దశలో ఉందని వివరించారు.
‘తదుపరి పరీక్షల కోసం పరాన్నజీవుల గురించి చాలా అనుభవం ఉన్న ల్యాబ్‌కు పంపాం’ అని వైద్యులు తెలిపారు. ‘ఆ మహిళ ఇంటికి సమీపంలో ఓ సరస్సు ఉంటుంది. అక్కడ కార్పెట్ కొండచిలువలు తిరుగుతాయి.. వంట కోసం ఆకుకూరలు, ఒక రకం గడ్డిని అక్కడి నుంచే ఆమె సేకరిస్తుంటారు. వాటి ద్వారానే.. ఆ కొండచిలువల విసర్జితాల్లోని పరాన్నజీవి ఆమెకు సోకిఉండొచ్చని అనుమానిస్తున్నాం’ అని పరిశోధకులు తెలిపారు. ఈ కేసు సంబంధించిన వివరాలను ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. ఇది మనుషుల్లో మునుపెన్నడూ వెలుగుచూడని కొత్త ఇన్ఫెక్షన్ అని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు.