సరిహద్దుల్లో తరచూ భారత్‌తో కవ్వింపులకు దిగే చైనా మరోసారి కొత్త వివాదానికి తెర లేపిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ ప్రాంతాలను కూడా కలుపుకోవడం తాజా ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ మ్యాప్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ.. చైనా తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే భారత్ స్పందన తర్వాత కూడా చైనా తన వక్రబుద్ధిని మార్చుకోకపోవడం మరింత వివాదాస్పదంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను కలుపుకుని విడుదల చేసిన మ్యాప్‌ను సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది.
అయితే ఈ క్రమంలోనే భారత్ నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనిపై ఇండియన్ మీడియాలో వస్తున్న వార్తలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బుధవారం మాట్లాడారు. ఇందులో చైనా చేసిన పనిని సమర్థించుకోవడం గమనార్హం. 2023 స్టాండర్డ్ మ్యాప్ విడుదల చట్టం ప్రకారం జరిగిందేనని తెలిపారు. ఇది చైనా సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ మాత్రమేనని వెల్లడించారు. ఈ మ్యాప్‌ను, అందులో ఉన్న ప్రాంతాలను సంబంధిత వర్గాలు నిష్పక్షపాతంగా పరిగణిస్తాయని.. అతిగా అర్థం చేసుకోవని ఆశిస్తున్నట్లు భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలతో ఆ దేశం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడినట్లయింది. అయితే చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
2023 ఏడాదికి గానూ చైనా.. ఓ స్టాండర్డ్ మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. ఇందులో వివాదాస్పద ప్రాంతాలతో పాటు భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ లాంటి ప్రాంతాలతో పాటు.. తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను కూడా కలుపుకోవడంతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా అందులో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా చేసిన ఈ చర్య పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దుల వివాదాలను మరింత రెచ్చగొట్టడమేనని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా మ్యాప్‌ను చైనా ఏకపక్షంగా రూపొందించిందని తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనిపై దౌత్యపరమైన మార్గాల్లో చైనాకు గట్టి నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్ బాగ్చి తెలిపారు. చైనా విడుదల చేసిన ఈ కొత్త మ్యాప్‌పై దేశంలోని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ విధానాల వల్లే సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతోందని మండిపడ్డాయి.